Ex Minister : వాళ్ల కాళ్లు చేతులు నరికేయండ్రా.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ?

Puvvada Ajay Kumar

Ex Minister Puvvada Ajay Kumar

Ex Minister  : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాళ్ల కాళ్లు చేతులు నరికేయండ్ర అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఓ ఆడియో కలకలం రేపుతోంది.  అజయ్ మాట్లాడినట్లు ఒక ఆడియో వైరల్ అయింది. ఆ ఆడియోలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధులను దుర్బాషలాడినట్లు ఉంది. కందాల ఉపేందర్ రెడ్డి, తాతా మధుల కాళ్లు, చేతులు నరికేయండని తన అనుచరులకు చెబుతున్నట్లు వినిపిస్తోంది.

దీనిపై మాజీ మంత్రి అజయ్ స్పందిస్తూ ఇది పూర్తిగా అవాస్తవం. ఆ ఆడియో తనది కాదని ఎలాంటి నిజనిజాలు తెలియకుండా ఆ ఆడియోను వైరల్ చేసిన టీవీ చానల్, సదరు రిపోర్టర్ పై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. అసలు ఆ ఆడియో తనది కాదని ఎవరో డీప్ ఫేక్ ద్వారా మార్పింగ్ చేసినట్లు ఆరోపించారు. ఏది నిజమో ఏదీ అబద్ధమో తెలుసుకోకుండా సదరు చానల్ ప్రసారం చేయడంపై మండిపడ్డారు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. అయితే సదరు చానల్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. వీరే కాకుండా లోకల్ గా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు కారు దిగి హస్తం, కమలం పార్టీలో చేరుతున్నారు.

 ఈ సమయంలో ఒకే పార్టీలో ఉన్న నాయకుల మధ్య ఇలాంటి అంతర్గత విబేధాలు రావడంతో కారు పార్టీ అధినేతకు తలనొప్పిగా మారింది. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా చేస్తామని కాంగ్రెస్ , బీజేపీ నేతలు హెచ్చరిస్తున్న సమయంలో పార్టీలోని నాయకుల్లో విబేధాలు రావడం కారు పార్టీకి చేటు కలిగించేదే. మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా అన్ని తానై ప్రచారం నిర్వహిస్తున్నారు. పువ్వాడ అజయ్ పరువునష్టం దావాకు సంబంధించి అన్ని ఆధారాలు సమర్పిస్తారా లేక సదరు టీవీ యాజమాన్యంతో కాంప్రమైజ్ అవుతారా చూడాలి.

TAGS