Throat Cancer : దేశంలో ఆందోళనకరంగా పెరుగుతున్న గొంతు క్యాన్సర్ కేసులు
Throat Cancer : భారత్ లో జీవనశైలి రోగాలు పెరుగుతున్నాయి. క్యాన్సర్, గుండెపోటు, లివర్, మూత్రపిండ ఆధారిత రోగాల బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అన్నింటి కంటే ప్రాణాంతకమైన క్యాన్సర్ రోగాలు విజృంభిస్తున్నాయి. అందులో గొంతు క్యాన్సర్ వ్యాధి దేశంలో ఆందోళనకర స్థాయిలో మారుతోంది.
టాటా మెమోరియల్ సెంటర్ (టిఎంసి) తాజాగా చేసిన ఓ అధ్యయనంలో నోటి క్యాన్సర్ల కారణంగా దేశంలో ఉత్పాదకత నష్టం 2022 లో సుమారు 560 కోట్ల డాలర్లు ఉందని తేల్చింది. ఇది దేశ జీడీపీలో 0.18 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నోటి క్యాన్సర్ మరణాల్లో మూడింట రెండొంతుల మరణాలు భారత్ లోనే సంభవిస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది.
2019 నుంచి 2022 మధ్య 36 నెలల పాటు క్యాన్సర్ చికిత్స పొందిన 100 మంది క్యాన్సర్ రోగులపై టీఎంసీ అధ్యయనం చేసింది. అందులోని సారాంశాలు ఇవే..
* 91% మరణాలు లేదా నయం కాని క్యాన్సర్లు 41.5 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో సంభవించాయి.
* ప్రారంభ దశ క్యాన్సర్లలో 70%, అధునాతన దశ క్యాన్సర్లలో 86% మధ్యతరగతి కుటుంబాలలో కనిపిస్తాయి.
* అకాల మరణాల వల్ల కోల్పోయిన ఉత్పాదకతను మానవ మూలధన విధానం ద్వారా లెక్కిస్తారు. అకాల మరణానికి పురుషులకు రూ.57,22,803, మహిళలకు రూ.71,83,917గా లెక్కించారు.
గొంతు క్యాన్సర్ లక్షణాలు:
– పగుళ్లు లేదా స్వరంలో బొంగురుపోవడం వంటి మార్పులు
-డిస్ఫాగియా(మింగడంలో ఇబ్బంది)
-గొంతులో నొప్పి
– నిరంతర దగ్గు(రక్తంతో)
-శోషరస కణుపులలో వాపు
– బరువు చాలా తగ్గడం
-చెవిలో స్థిరమైన నొప్పి
-గురక
– తలనొప్పి
గొంతు క్యాన్సర్ నివారణ:
– ధూమపానం మానేయ్యాలి.
– ఆల్కహాల్ వినియోగం తగ్గించాలి.
-ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలి.
– కొన్ని రకాల గొంతు క్యాన్సర్లు లైంగికంగా సంక్రమించే హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్ పీ వీ) వల్ల రావొచ్చు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
చికిత్స:
– కణితి పరిమాణంలో చిన్నగా ఉంటే సర్జరీ ద్వారా తొలగిస్తారు.
-కణితిని తీసివేసిన తర్వాత రేడియేషన్ థెరపీ కూడా చేయవచ్చు.
– కీమో థెరపీ, టార్గటెడ్ థెరపీ వంటి విధానాల ద్వారా గొంతు క్యాన్సర్ ను తగ్గిస్తారు.