Strange Disease In America : అమెరికాలో మూగ జీవాలకు వింత వ్యాధి.. మృత్యు వాత పడుతున్న శునకాలు
Strange Disease In America : అమెరికాలో పెంపుడు శునకాలకు వింత వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధితో శునకాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయి. క్రమంగా ఈ వ్యాధి మరణానికి దారి తీస్తుంది. యూఎస్ లోని ఓరెగాన్ రాష్ట్రంలో ఆగస్ట్ నుంచి 200 వరకు కేసులు నమోదైనట్లు పశు వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా కొలరాడో, న్యూ హ్యాంప్ షైర్ రాష్ట్రాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
రోడ్ ఐ ల్యాండ్, మసాచు సెట్స్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి శాంపిళ్లు వస్తున్నాయని న్యూ హ్యాంప్ షైర్ యూనివర్సిటీ పశు వైద్య పరిశోధకుడు డేవిడ్ నీడిల్ తెలిపారు. ఏడాదిగా మూగ జీవాలను ఈ వ్యాధి ఇబ్బంది పెడుతుందన్నారు. అధికంగా కుక్కలు చనిపోతున్నట్లు తెలుస్తుందని, పెంపుడు కుక్కల యజమానులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ వ్యాధి సోకిన శునకాల్లో దగ్గు, ముక్కువెంట నీరు కారడం, తుమ్మలు, కళ్ల నుంచి నీరు కారడం, బద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ఎలాంటి యాంటీ బయాటిక్స్ ఈ వ్యాధిపై ప్రభావం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధిపై భారీగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నట్లు చెప్పారు. సకాలంలో పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యులకు చూపించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పెంపుడు కుక్కలకు కొంచెం సమయం కేటాయించాలని, దీంతో పాటు వాటి ఆరోగ్యానికి కావలసిన పోషకాహారం అందించాలని సూచించారు. వాటితో ఎక్కువ సమయం గడపడం వల్ల అవి హ్యాపీగా ఫీలైతే ఇమ్యునిటీ పవర్ పెరుగవచ్చని దీంతో వ్యాధిని కొంత ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని సూచనలు చేస్తున్నారు. ఈ వ్యాధి ఏంటనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.