Tesla Jobs : ఉద్యోగాల కోతలు.. హెచ్ఆర్ హెడ్ అవుట్..!
Tesla Jobs : ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాలో లేఆఫ్ లు అలజడి సృష్టిస్తున్నాయి. ఈ కంపెనీ భారీగా ఉద్యోగాలను తగ్గించేస్తోందని, సుమారు 20 శాతం సిబ్బందిని తగ్గిస్తుందని గత నెలలో బ్లూమ్ బెర్గ్ నివేదించింది. బ్లూమ్ బెర్గ్ వెల్లడించినట్లుగానే టెస్లాలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా పేరున్న నలుగురిలో ఒకరైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డ్రూ బాగ్లినోతో సహా మస్క్ టాప్ లెఫ్టినెంట్లలో కొందరు కూడా కొన్ని వారాల క్రితం రాజీనామా చేశారు. తాజాగా టాప్ హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ అల్లి అరేబాలో కంపెనీని వీడారు. నేరుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్‌కి రిపోర్టింగ్ చేసే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆమె అంతట ఆమెనే కంపెనీ వీడారా..? లేక ఉద్యోగాల కోతలో భాగంగా ఉద్వాసనకు గురయ్యారా..? అనేది స్పష్టంగా తెలియలేదు.
ఇటీవల టెస్లా వాహనాల విక్రయాలు క్షీణించడం మొదలైనప్పటి నుంచి ఖర్చుల కట్టడి, సిబ్బంది కోతపై ఎలాన్ మస్క్ దృష్టి పెట్టారు. టెస్లా ఛార్జింగ్ కనెక్టర్ లను స్వీకరించే ప్రక్రియలో ఇతర ఆటోమేకర్ లతో భాగస్వామ్యాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ సూపర్ ఛార్జర్ టీంలో చాలా మందిని ఇప్పటికే తొలగించారు.