Janasena : జనసేన నాయకులకు అవమానం..సమన్వయలోపమే కారణం..
Janasena : ఆంధ్రప్రదేశ్ టీడీపీ కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. విభేదాలు మెల్లగా బహిర్గతం అవుతున్నాయి. ఇన్నాళ్లు కలిసి తిరిగిన పార్టీ నేతల మధ్య ఒక్కసారిగా ఆధిపత్య పోరు ప్రారంభమైంది. నేతల మధ్య సయోధ్య కుదరక అయోధ్యలా మారుతోంది. నాయకుల మధ్య వైరం పెరుగుతోంది. దీంతో ఒకరిపై మరొకరు తోసుకునే వరకు వెళ్లింది.
టీడీపీ, జనసేన, బీజేపీలు పరస్పరం పొత్తులతో ముందుకు వెళ్లాయి. దీంతో జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. బీజేపీకి 10 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించింది. కానీ వీటి మధ్య సయోధ్య మాత్రం కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ మూడు పార్టీలు కలిసి ప్రచారం చేయాలని చెబుతున్నా అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
ఇటీవల దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ జనసేన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రచారంలో మీరు గొడవపడితే బాగుండదు. ఏదైనా ఉంటే మీ జిల్లా అధ్యక్షుడి సమక్షంలో తేల్చుకోవాలని సూచించారు. అంతేకాని మా మీటింగులో మీరు గొడవ పడితే మాకు చెడ్డ పేరు వస్తుందని వారిపై గుస్సా వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మరో ఘటనలో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో టీడీపీ ప్రచార రథంపై జనసేన నాయకులను బలవంతంగా దించేశారు. ఇదేంటని అడిగితే మీరు మాకు అవసరం లేదు. వారి చొక్కాలు పట్టుకుని కిందకు లాగేశారు. వారి ప్రచార రథంపై జనసేన జెండాలు ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. దీనిపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా జనసేన నాయకులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. మిత్రపక్షమైనా టీడీపీ పట్టించుకోవడం లేదు. వారికి విజయగర్వం పెరుగుతోందని, ఎవరు లేకున్నా గెలుస్తామనే ఉద్దేశంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారి ఆగడాలకు చెక్ పెడతామని జనసేన నాయకులు చెబుతున్నారు. కాగా, ఇదంతా క్షేత్రస్థాయిలో అవగాహన లేమితోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. కూటమి అధినేతలు, అభ్యర్థులు ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ వెళ్తే మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని సీనియర్ నేతలు చెబుతున్నారు.