BJP : డబుల్ ఇంజన్ తో రాష్ట్రాలను ఆడుకుంటున్న కమలం
BJP : కేంద్రంలో అధికారం చేపట్టి పదేళ్లుగా తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ మరింత ఎదిగింది. లోకసభ తో పాటు రాజ్య సభలో సొంత మెజార్టీ సాధించింది. ఎదురులేని పార్టీగా అవతరించింది. రాష్ట్రాల్లో కూడా పాగా వేయడానికి మెల్ల,మెల్లగా పావులు కదుపుతూ బలోపేతమవుతున్నది. ఉత్తర భారత దేశంలో తిరుగులేని పట్టు సాధించింది. ఇప్పుడు దక్షిణ భారతంపై పడింది. ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ఉనికి లేని రాష్ట్రాల్లో కాలుమోపడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కమలాన్ని వికసింపజేసి దేశంలో ఒకే దేశం, ఒకే పార్టీ అనే పేరు సాధించాలని భారతీయ జనతా పార్టీ తహ తహ లాడుతోంది. తాజా ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపి, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుంది. మరోవైపు వైసీపీ తో స్నేహపూర్వక వాతావరణం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్ష పార్టీలకు, ఇటు రాష్ట్ర ప్రజలకు అంతుపట్టడంలేదు. అసలు బీజేపీ వ్యూహం ఏమిటి. కూటమితో ఒకతీరు, అధికారంలో ఉన్న పార్టీతో ఒకతీరు వ్యవహరిస్తోంది బీజేపీ.
ఆంధ్రాలో కమలం పార్టీకి ఒక జిల్లాపరిషత్ చైర్మన్ కానీ, ఒక మున్సిపల్ చైర్మన్ కానీ, మండల్ పరిషత్ అధ్యకుడు కానీ లేదు. ఇప్పటి వరకు ఆ ప్రాంతం నుంచి కేంద్రానికి నాయకులు వెళ్లింది. పక్కదారి నుంచి కావడం విశేషం. అటువంటి పార్టీ ఢిల్లీ పెద్దలు రాష్ట్రంలో నాయకత్వం ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారంటే నమ్మశక్యంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు దేశం పార్టీ, జనసేన సంయుక్తంగా మేనిఫెస్టో ఏర్పాటు చేసింది. మేనిఫెస్టోని విడుదల సందర్బంగా బీజేపీ నేత అసంతృప్తితో వ్యవహరించారు. ఇది వైసీపీకి ఆయుధం కావడం తో ఎదురుదాడికి దిగింది. అదే విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తయారుచేసిన మేనిఫెస్టోపై మోదీ బొమ్మ లేకపోవడం కూడా వైసీపీ కి అదనపు ఆయుధం దొరికినట్టు అయ్యింది. టీడీపీ, జనసేన పార్టీలకు బీజేపీ మద్దతు లేదనేది తేలిపోయిందంటూ జగన్ ప్రచారంలో ఉతికేస్తున్నారు. దీంతో జనసేన,టీడీపీ అభ్యర్థులకు బీజేపీ తో కలిసి ఉన్నందుకు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా పరిస్థితి తయారైనది.