Glass Symbol : స్వతంత్రులకూ గాజు గ్లాస్ గుర్తు..ఆ పార్టీ కుట్రేనా?
Glass Symbol : ఏపీ రాజకీయాల్లో గాజు గ్లాస్ ప్రకంపనలు రేపుతోంది. జనసేన పార్టీ గుర్తుగా గాజు గ్లాస్ జనాల్లోకి బాగానే వెళ్లింది. కురు వృద్ధుడిని అడిగిన కూడా గాజు గ్లాస్ పవన్ కల్యాణ్ పార్టీది అని చెబుతారు. అయితే ఇప్పుడు ఈ గాజు గ్లాస్ ను జనసేన పోటీలో లేని చోట అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించింది. ఇప్పుడు ఈ విషయమే కూటమి పార్టీల్లో ప్రకంపనలు రేపుతోంది. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది.
ఎన్డీయే కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి, ఓట్లు చీల్చేందుకు వైసీపే ఈ కుట్రకు తెరలేపిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా ఎన్డీయే అభ్యర్థులు బలంగా, విజయావకాశాలు ఎక్కువగా ఉన్న చోట్ల.. స్వతంత్రులుగా బరిలో ఉన్న ఆయా పార్టీల రెబల్ అభ్యర్థులకు, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 50కు పైగా శాసనసభ, లోక్ సభ స్థానాల్లో స్వతంత్రులకు, చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఈమె మొరసన్నపల్లి వైసీపీ సర్పంచ్ జగదీశ్ భార్య. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలిలో, గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించారు. ఇంకా టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్న పలు చోట్ల, అలాగే కూటమి రెబల్ అభ్యర్థులు పోటీ ఉన్న చోట కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం. ఇదంతా వైసీపీ వ్యూహంలో భాగమేనని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.