Mega Family : పవర్ స్టార్ కోసం మెగా ఫ్యామిలీ..ముహూర్తం ఫిక్స్..
Mega Family : ఏపీలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు శక్తివంచన లేకుండా కృష్టి చేస్తున్నాయి. ఇక అందరి కళ్లు పిఠాపురం నియోజకవర్గం వైపే ఉన్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్..ఈసారి కచ్చితంగా గెలిచేలా స్కెచ్ వేశారు. ఇక ఆయన గెలుపు కోసం మెగా ఫ్యామిలీ కదులుతోంది. ఈ మేరకు చిరంజీవి, నాగబాబు దగ్గరుండి మరీ ప్రచారం ముమ్మరంగా కొనసాగించనున్నారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో పవన్ కల్యాణ్ కూడా అన్నయ్య కోసం తీవ్రంగా శ్రమించిన విషయం తెలిసిందే.
పిఠాపురంలో నామినేషన్ సందర్భంగా అశేష జనవాహిని తరలి వచ్చింది. టీడీపీ నేత వర్మ పవన్ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. జనసేన నేతలను రంగంలోకి దించి సామాజిక సమీకరణలను చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే రెండు సభలు నిర్వహించి ప్రజల్లో మంచి పట్టు సాధించారు. ఈనేపథ్యంలో పిఠాపురంలో జనసేన జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
టీడీపీ కూటమి నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి పోటీ చేస్తున్న పంచర్ల రమేష్ బాబుకు చిరంజీవి మద్దతు ప్రకటించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి విజయం సాధించిన వంగా గీత ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆమెను ఓడించడమే పవన్ కల్యాణ్ లక్ష్యం.
చిరంజీవితో పాటు రాంచరణ్ కూడా ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది. బాబాయ్ గెలుపు కోసం తండ్రితో పాటు తనవంతు కర్తవ్యంగా రాంచరణ్ కూడా ప్రముఖ పాత్ర పోషించనున్నారు. మే5న చిరంజీవి, నాగబాబు, రాంచరణ్ అందరు కలిసి రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారైంది. దీని కోసం మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
చిరంజీవి తన ప్రచారంలో జగన్ ను టార్గెట్ చేసుకుంటారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ను గెలిపించాలంటే జగన్ పై విమర్శలు చేయక తప్పదు. చిరంజీవి నిర్ణయం ఏంటనేది తెలియాల్సి ఉంది. చిరంజీవి వెంట టీడీపీ, బీజేపీ శ్రేణులు పాల్గొంటారని అంటున్నారు. ఇది అభిమానులకు ఓ పెద్ద పండగే అనుకుంటున్నారు.