Illegal Sand Dumping : గడువు తీరినా ఆగని తవ్వకాలు గోదావరి తీరంలో యథేచ్ఛగా ఇసుక దందా
Illegal Sand Dumping : గోదావరి తీరం ఇసుకాసురుల అక్రమాలకు అడ్డాగా మారింది. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ గోదారి తల్లి గుండెను చీల్చేందుకు భారీ యంత్రాలు దింపుతున్నారు. అనుమతుల్లేకుండా నిత్యం వేల సంఖ్యలో లారీల్లో ఇసుక సరిహద్దులు దాటుతున్నది. కిలోమీటర్ల మేర లారీలు తీరుతూ కనిపిస్తున్నాయి. నర్సరీ రైతుల వ్యాపారాన్ని సైతం గండికొడుతున్నారు. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తు్న్న వారిపై కేసులు పెట్టడం, చంపేస్తామంటూ బెదిరించడం చేస్తున్నారు. ఇదంతా తూర్పుగోదావరి బుర్రిలంక రేవులో జరుగుతున్న ఇసుకాసురుల బాగోతం
గోదావరి నదీ గర్భంలో ఇష్టారీతిన తవ్వకాలు సాగుతున్నాయి. జాతీయ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ప్రధాన కాల్వ, నర్సరీ పొలాల నుంచి రీచ్ వరకు లారీలు నిలిచి ఉంటున్నాయి. ఇసుక మాఫియాకు అడ్డు లేదని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి అవసరం లేదు. తూర్పుగోదావరి జిల్లా బుర్రిలంక రేవు.. ఇసుక అక్రమార్కుల కబంద హస్తాల్లో చిక్కుకొని విలవిలాడుతున్నది. ఈ ర్యాంపులో తవ్వకాల గడువు మే 5న తీరింది. అయినా ఇప్పటి వరకు కొత్త టెండర్ల ప్రక్రియ ఖరారు చేయలేదు. దీంతో ఇసుక అక్రమార్కులకు ఈ రేవు కేంద్రంగా మారింది.
అనుమతులు ముగిసినా జేపీ సంస్థ వే బిల్లులతోనే యథేచ్ఛగా రవాణా కొనసాగుతున్నది. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి సమీపంలోనే బుర్రిలంక గోదారి రేవు ఉన్నది. అక్కడ నిబంధనలను తుంగలో తొక్కి 30 అడుగులకుపైగా నదిలోంచి ఇసుక తోడేస్తూ అక్రమంగా తరలిస్తున్నారు. హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు సైతం అమలు కావడం లేదు. గతంలో ఇక్కడ బోట్స్‌మెన్ సొసైటీ ద్వారా కూలీలు ఇసుక తోడుకొని ఉపాధి పొందేవారు. ప్రస్తుతం యంత్రాలను వినియోగిస్తుండడంతో కూలీలకు పని లేకుండా పోతున్నది. ఇసుకాసురులు రెచ్చిపోతుండగా, మైనింగ్ సహా ఇతర అధికారులు ఇటు వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నర్సరీలకు ప్రసిద్ధి కడియం ప్రాంతం .కానీ ఇసుక అక్రమార్కుల ఆగడాలతో ఇక్కడ నర్సరీల ఉనికే ప్రశార్థకంగా మారింది. ఇసుక లారీల బారులు తీరుతుండడంతో మొక్కలు తీసుకు వచ్చే వాహనాలు ఇటువైపు వచ్చే అవకాశం లేకుండాపోతున్నది. మొక్కల ఎగుమతులు, దిగుమతులకు ఆటంకం కలుగుతుండడంతో రైతుల వ్యాపారానికి గండిపడుతున్నది. 50కిపైగా టన్నుల ఇసుక లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తుండడంతో గోదావరి గట్టు బలహీనంగా మారుతున్నది. వరదలొస్తే గట్టు తెగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బుర్రిలంక ఇసుక ర్యాంపులో తవ్వకాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్పరిశీలించారు. దోచుకో.. దాచుకో మాదిరిగా తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని వారు మండిపడ్డారు.