KCR Interview : పదేళ్ల తర్వాత కేసీఆర్ ఇంటర్వ్యూ..అధికారంలో ఉన్నప్పుడు టైం ఇవ్వలేదు కానీ..
KCR Interview : భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండగా దేన్ని పట్టించుకోలేదు. ప్రజలను చూడలేదు. పనులు చేయలేదు. పరిపాలన అంతా అధికారులకే వదిలేసి హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. అధికారం కోల్పోయాక కానీ ప్రజలు గుర్తుకు రాలేదు. వారి బాధలు గుర్తెరగలేదు. కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయినా కనీసం వారిని పరామర్శించలేదు. అప్పట్లో అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
అంతా అధికార యంత్రాంగం మీదే వదిలేసి తాను మాత్రం చోద్యం చూశారు. దీనికి తోడు కొడుకు కేటీఆర్ కు కూడా కళ్లు నెత్తికెక్కాయి. ప్రతిపక్షాలను ఇష్టమొచ్చిన రీతిలో దుర్భాషలాడటం, జీవితకాలం సీఎంగా కేసీఆర్ ఉంటారని ప్రచారం చేసుకోవడం ఎబ్బెట్టుగా అనిపించేది. దీంతో ప్రజలకు కాలింది. కీలెరిగి వాత పెట్టారు. అధికారానికి దూరం చేశారు.
ప్రస్తుతం కేసీఆర్ టీవీ9 ప్రతినిధి రజనీకాంత్ కు ఇంటర్వ్యూ ఇస్తారనే వార్త ప్రచారం హోరెత్తుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలకు మొహం చాటేసిన కేసీఆర్ ఇప్పుడు అధికారం పోయాక కానీ ప్రజల బాధలు గుర్తుకు రావడం లేదు. దీంతో ఇందులో కేసీఆర్ ఏం మాట్లాడతారోననే ఉత్కంఠ అందరిలో నెలకొనడం మామూలే.
కేసీఆర్ సీఎంగా ఉండగా ఏనాడు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరినా సమయం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రజనీకాంత్ కు సమయం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి మోడీకి అనుకూలంగా ఉండే మీడియాకు మాత్రమే అపాయింట్ మెంట్ ఇచ్చే కేసీఆర్ ఇప్పుడు ఇంటర్వ్యూకు సమయం ఇవ్వడమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను లక్ష్యంగా చేసుకుని ఏం చెబుతారనేదే ప్రశ్న. పదేళ్లు అధికారంలో ఉన్నా ఏనాడు రైతు సమస్యలపై మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు వారి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేస్తున్నారు. పదవి పోతే గానీ రైతుల సమస్యలు గుర్తుకు రాలేదా అని సెటైర్లు వేస్తున్నారు.