Congress Guarantee : దుమారం రేపుతున్న కాంగ్రెస్ హామీ.. అదే మోదీకి పెద్ద ఆయుధమైంది..
Congress Guarantee : ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ అయిన ఆర్థిక, సంస్థాగత ప్రకంపనలు రేపుతోంది. రాహుల్ గాంధీ ప్రసంగాల్లో దీనికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ హామీని ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీ దేశంలో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
దేశవ్యాప్తంగా కుల ప్రాతిపదికన జనాభా గణన నిర్వహించడమే కాకుండా అధికారంలోకి వస్తే ధనవంతులు ఎవరనేది నిర్ధారించడానికి ఆర్థిక, సంస్థాగత సర్వే చేస్తామని రాహులు చెబుతున్నారు. రెండు సర్వేల తర్వాత దళితులు, ఆదివాసీలు, వెనకబడిన తరగతులు, మైనారిటీలకు సరైన వాటా కల్పించేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకుంటామని ఆయన అంటున్నారు. కుల సర్వే అనేది సామాజిక ఎక్స్ రే అని చెబుతూ, దేశంలోని 73 శాతం ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు పెద్ద పెద్ద కార్పొరేట్లు, మీడియా సంస్థలు లేదా హైకోర్టుల్లో కూడా ప్రాతినిధ్యం లేదన్నారు.
కుల ఆధారిత జనాభా లెక్కల ద్వారా పాలు ఏవో, నీరు ఏవో తెలిసిపోతుందన్నారు. ఆర్థిక సర్వే ద్వారా మొదట ఎవరికి ఎక్కువ సహాయం అవసరమో తెలుసుకోవడానికి వివిధ కులాలకు చెందిన వారు ఎంత మంది ఉన్నారో లెక్కిస్తామన్నారు. ఆ తర్వాత దేశం ఆర్థికంగా ఎలా పనిచేస్తుందో పరిశీలించి డబ్బు, ఉద్యోగాలు, ఇతర ప్రయోజనాలను జనాభా ఆధారంగా పంచడానికి ప్రణాళికలు రూపొందిస్తామని రాహుల్ చెబుతున్నారు.
అయితే కాంగ్రెస్ సంపద పున:పంపిణీ హామీపై ప్రధాని మోదీ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు ఇళ్లు ఉన్నవారి నుంచి ఒక ఇంటిని లాక్కుంటుందని విమర్శలు చేశారు. ‘‘ఇండియా కూటమి దృష్టి ప్రజల సంపాదన, ఆస్తులపై పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువరాజు చెప్పినట్లు ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు..ఎవరికీ ఎన్ని ఆస్తులు ఉన్నాయో.. అమ్మనాన్నలకు, అక్క చెల్లెళ్లకు ఎంత బంగారం విచారణ చేపడుతారు.. ఇది మావోయిస్టు భావజాలం. కాంగ్రెస్ భారతదేశంలో దీన్ని అమలు చేయాలనుకుంటోంది.’’ అని మోదీ చెప్పుకొచ్చారు. మొత్తంగా కాంగ్రెస్ సంపద పున:పంపిణీ హామీ బీజేపీకి ఎన్నికల సరుకు అయ్యింది.