Software Engineer : ఒక్క క్షణంలోనే ఎంత ఘోరం..నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Software Engineer : చిన్న నిర్లక్ష్యం జీవితాలనే బలి తీసుకుంటుంది. మనం చేసే చిన్న చిన్న తప్పులతో ఒక్కొసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటిదే హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ లో జరిగింది. హాస్టల్ లోని నీటి సంపులో పడి ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన అక్మల్ అనే యువకుడు హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు.
అక్మల్ ప్రతీ రోజు ఉదయం జిమ్ కు వెళ్లివచ్చేవాడు. మొన్న ఆదివారం కూడా జిమ్ చేసి హాస్టల్ కు తిరిగి వచ్చాడు. గేట్ తీసుకుని లోపలికి వస్తున్న సమయంలో..ఒక చేతిలో కవర్, మరో చేతిలో ఫోన్ ఉండడంతో కిందికి గమనించకుండా ముందుకు నడిచాడు. అయితే గేటు తర్వాత నడిచే మార్గంలోనే నీటి సంపు ఉండడం..అది తెరిచి ఉండగా..అది చూసుకోకుండా పరధ్యానంగా ముందుకు నడవడంతో ఒక్కసారిగా సంపులో పడిపోయాడు. ఈక్రమంలో అతడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
ఆలస్యంగా గమనించిన హాస్టల్ యజమాని.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అక్మల్ డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో హాస్టల్ యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. అక్కడే ఉన్న సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించగా.. చూసుకోకుండా అక్మల్ ముందుకు నడుస్తూ అప్పటికే తెరిచి ఉన్న సంపులో పడిపోయినట్టుగా రికార్డయ్యింది. అక్మల్ సంపులో పడిన వెంటనే యజమాని స్పందించలేదని తెలుస్తోంది. సంపు తెరిచి ఉన్నట్టుగా అక్కడ ఎలాంటి సైన్ బోర్డు కూడా లేకపోవడంతోనే అక్మల్ నడుచుకుంటూ ముందుకెళ్లాడు. మొత్తంగా యజమాని నిర్లక్ష్యం వల్లే అక్మల్ చనిపోయినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.