Owaisi Vs BJP : ఓవైసీలకు ధీటైన అభ్యర్థి బీజేపీకి దొరికనట్లేనా?
Owaisi Vs BJP : మరోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఏడాది ముందు నుంచే పకడ్బందీ వ్యూహాలతో ముందుకు సాగుతున్నది. ఇదే సమయంలో దక్షిణ భారతదేశంలో పట్టున్న కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ మరింత బలంగా నాటుకుపోవాలని ప్రణాళికలు రచిస్తున్నది. ఇప్పటికే కర్ణాటకలో అధికారం కోల్పోవడం బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నది. వైఫల్యాలను సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నది.
హైదరాబాద్ పై కాషాయం జెండా ఎగరాల్సిందే..
తెలంగాణలో ఇప్పటికే ఉన్న స్థానాలతో పాటు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై కాషాయం జెండా ఎగరవేయాలని పట్టుదలగా ఉంది. ఇక్కడ బీజేపీ జెండా ఎగిరితే తెలంగాణలో అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తునన్నది.
రాజాసింగ్ ను కాదని ఆమె వైపే మొగ్గు..
బీజేపీలో ఫైర్ బ్రాండ్ కు చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే. ఆయన కరుడు గట్టిన హిందుత్వ వాది. కట్టర్ హిందుగా అనుచరులతో పాటు కాషాయ పార్టీ అభిమానుల్లో పేరుపొందారు. పార్టీ సిద్ధాంతాలకన్నా హిందుత్వ సిద్ధాంతమే తనకు ఎక్కువని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాజాసింగ్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలతో జైలుకు వెళ్లడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. ఇంత జరిగినా ఆయన మాత్రం తన స్టాండ్ మార్చుకోలేదు. ఇలాంటి కరుడుగట్టిన హిందుత్వ వాదిని కాదని బీజేపీ మాత్రం అనూహ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి మహిళా అభ్యర్థిని ప్రకటించి అందరినీ ఆశ్చపరిచింది.
ఎవరీమాధవిలత.. ఎందుకంత ప్రాధాన్యం?
కొంపెల్లి మాధవీలత హిందుత్వ వాది గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి వాక్చాతుర్యం ఆమె సొంతం. స్థానిక నేతలతో అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా బీజేపీ పెద్దలు ఆమెకు టికెట్ కేటాయించడంతో నోరెళ్లబెట్టడం వారి వంతైంది. ఇక్కడి వారితో సంబంధం లేకుండా ఆమె తన ప్రచారం సాగిస్తున్నారు. మోడీ కార్యాలయం నుంచి ఫుల్ సపోర్ట్ ఉండడంతో సైలెంట్ అయ్యారు.
ప్రధాని కితాబు
రెండు వారాల క్రితం ఇండియా టీవీ ఆప్ కి ఆదాలత్ కార్యక్రమానికి హాజరయ్యారు మాధవీలత. ఆమె వాక్చాతుర్యానికి ప్రధాని సైతం మంత్రముగ్ధులయ్యారు. ఆమెను ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి 3.6 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. అయితే బీజపీ పెద్దలకు మాధవీలతపై పూర్తిస్థాయిలో నమ్మకం ఉన్నట్లు అర్థమవుతున్నది. ఓవైసీలను ఢీకొట్టాలంటే ఇలాంటి అభ్యర్థి కావాలని ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు పార్టీలో ప్రాధాన్యమిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానం గెలవాలనే బీజేపీ నేతల ఆశలు ఏ మేరకు సఫలమవుతాయో వేచిచూడాల్సిందే.