Telangana : తెలంగాణలో మైండ్ గేమ్..ఆ పార్టీ ఒక్కటే సేఫ్
Telangana : ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీల్లో మూడుముక్కలాట మాదిరి రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ నిందలు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని కూలుస్తామని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ చెబుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది.
ఇప్పుడు బీజేపీ మాత్రం గట్టున ఉంది. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నుంచి భయం పొంచి ఉంది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తాయని అంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాయని మరో వాదన వస్తోంది. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ భయంతో రగిలిపోతున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి తమ జోలికి వస్తే ఊరుకోబోమని చెబుతుండటం వారి భయానికి కారణంగా తెలుస్తోంది.
దీంతో రాష్ట్రంలో మూడుముక్కలాట లాగా రాజకీయాలు మారుతున్నాయి. మూడు పార్టీలు మైంగ్ గేమ్ లు ఆడుతున్నాయి. మూడు పార్టీల్లో బీజేపీ ఒక్కటే సేఫ్ జోన్ లో ఉంది. మిగతా రెండు పార్టీల్లో భయం నెలకొంది. దీంతో బీజేపీ విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో తన సత్తా చాటాలని బీజేపీ యోచిస్తోంది. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటోంది.
ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో బీఆర్ఎస్ బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుందని అంటున్నారు. కవిత అరెస్ట్ తరువాత బీఆర్ఎస్ నేతలు బీజేపీని కాకుండా కాంగ్రెస్ పార్టీనే విమర్శిస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి కనీసం ఐదు సీట్లకు తగ్గకుండా గెలుచుకోవడానికి బీఆర్ఎస్ రహస్యంగా తోడ్పడుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని మాత్రమే విమర్శిస్తున్నారు.
రాబోయే రోజుల్లో బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ కడతాయని చెబుతున్నారు. కాంగ్రెస్ లో 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కేసీఆర్ చెప్పడంతో రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. మా ఎమ్మెల్యేల జోలికి వస్తే తాట తీస్తామని చెప్పడంతో కాంగ్రెస్ వాళ్లు కూడా భయాందోళనలో ఉన్నట్లు సమాచారం.
ఈనేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం పేకాట మాదిరి ఉంటోంది. ఒక పార్టీ మరో పార్టీపై ఆరోపణలు చేస్తోంది. ఎవరి బలం వారిని గెలుపు ముంగిట నిలుపుతుందని నమ్ముతున్నారు. ఈక్రమంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నాయి.