Katra Vaishnodevi : కట్రా ‘వైష్ణోదేవి’ అమ్మవారి దర్శనం..గుహలో ప్రయాణం అత్యద్భుతం..

Katra Vaishnodevi

Katra Vaishnodevi

Katra Vaishnodevi : దేశంలో లక్షల సంఖ్యలో అద్భుత ఆలయాలు ఉన్నాయి. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న హిందూమత వైభవాన్ని ఈ ఆలయాలే పరిరక్షిస్తున్నాయి. అద్భుతమైన ఈ ఆలయాల్లో ముందువరుసలో ఉంటుంది వైష్ణో దేవి ఆలయం. ఇది జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఉంది. ఈ చల్లని తల్లిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల ఉన్న హిందూ భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయం ఎన్ని ఏండ్ల కిందటిదో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం ఉన్న గుహ మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నట్లు తేలింది. ఏడాది పొడవున్నా అమ్మవారి ఆలయం తెరిచే ఉన్నప్పటికీ మార్చి నుంచి అక్టోబర్ వరకూ ఉత్తమ సమయం.

వైష్ణో దేవి విగ్రహం ఉన్నచోటుకు వెళ్లాలంటే గుహల్లో చాలా దూరం ప్రయాణించాలి. అయితే ఈ దూరాన్ని తగ్గించేందుకు మరో రెండు గుహల్లో అధికారులు దారులను ఏర్పాటు చేశారు. వైష్ణోదేవి ఆలయం ఉన్న కొండ సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో ఉంది. ఇక ప్రధాన ఆలయం ఉన్న గుహ 30 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల ఎత్తు ఉంటుంది. వైష్ణోదేవి ఆలయం ఉన్న గుహలు కొన్ని లక్షల ఏండ్ల కిందనే ఏర్పడ్డాయట.

భైరవుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత దుర్గాదేవే వైష్ణోదేవి రూపంలో ఇక్కడ అవతరించిందని చెబుతారు. అలాగే ఆ రాక్షసుడి తల గుహ నుంచి లోయలో పడిపోయిందని స్థల పురాణం చెబుతోంది. రాక్షసుడి దేహం కూడా అక్కడే ఉన్న గుహల్లోని ఏదో ఒక గుహలో ఇప్పటికీ ఉందంటారు. అందుకే ఆలయం సమీపంలో ఉన్న గుహలను ఎప్పుడూ మూసే ఉంచుతారు.

వైష్ణోదేవి మాతను కొందరు లక్ష్మీ స్వరూపమని, మరికొందరు పార్వతీ స్వరూపమని చెబుతారు. నిజానికి మహాలక్ష్మీ, మహా కాళీ, మహా సరస్వతి.. ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి అని పండితులు చెబుతున్నారు. భైరవుడునే రాక్షసుడి సంహారం కోసం ఆ మహాతల్లుల దీవెనతో వైష్ణవి అనే బాలిక జన్మిస్తుంది. రాక్షస సంహారం తర్వాత అమ్మవారు త్రికూటపర్వతంపై గుహలో 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది. వైష్ణోదేవి గుహాలయంలో మనకు కనిపించే రాతిరూపాలు(పిండీలంటారు అక్కడివారు) ఆ మాత తలలే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెబుతారు.

వైష్ణోదేవి ఆలయానికి జమ్మూ కశ్మీర్ లోని కట్రా వరకు రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. అక్కడి నుంచి యాత్ర మొదలయ్యే మెయిన్ గేట్ వరకూ ఆటోలో వెళ్లవచ్చు. అక్కడి నుంచి డోలీ యాత్ర మొదలవుతుంది. జీవితంలో ఒక్కసారైనా ప్రతీ హిందువు వైష్ణోదేవిని దర్శించుకోవాలని పండితులు చెబుతుంటారు.

TAGS