Congress : బీఆర్ఎస్ ను లైట్ తీసుకోండి.. కేవలం బీజేపీతో మాత్రమే పోటీ..
Congress : ఉత్తరాదిలో బీజేపీ బలహీనపడుతోందని, అందుకే దక్షిణ భారతంపై దృష్టి పెట్టిందని.. ఇక్కడా అవకాశం ఇవ్వద్దని కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించుకోవడమే పార్టీకి కీలకమని సూచించారు. మొత్తం 17లో 15 చోట్ల మనమే జెండా ఎగరేసేలా లక్ష్యం పెట్టుకొని పని చేయాలని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల వ్యూహంపై ఇన్‌చార్జిలు, అభ్యర్థులతో ఆదివారం (ఏప్రిల్ 14) రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో సమీక్ష నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలతో పాటు 14 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొన్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం.. ప్రచారంపై అధిష్ఠానం తరఫున వేణుగోపాల్ దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయయే ఇప్పుడూ వరిస్తుందని భ్రమపడవద్దని, కష్టపడి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడిందని.. ఆ పార్టీని పక్కన పెట్టి బీజేపీపై పోరాటానికి దిగాలని ఉద్బోధించారు. బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు వస్తే క్షేత్ర స్థాయిలో కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని తన దృష్టికి వచ్చిందని, దీనిపై చర్చలు తీసుకుంటామన్నారు.
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పార్టీలోకి రాకుండా అడ్డుకుంటే.. వారు మరో పార్టీ బీజేపీలోకి వెళ్తారని, దీంతో ఆ పార్టీకి బలం పెరుగుతుందని, అలా జరగకుండా చూసుకోవానలి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బలహీనం కావడం వల్ల 6, 7 నియోజకవర్గాల్లో బలం పుంజుకునేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని కేసీ వేణుగోపాల్ అన్నట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవడంపై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీని వీడిన వారినీ తిరిగి చేర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అనుమానాలుంటే నివృత్తి చేయాలని సూచించారు.
సీఎం సహా అందరూ ప్రచారానికి వెళ్లాలి..
కొందరు అభ్యర్థులు ప్రచారంలో వెనకబడినట్లు తెలుస్తుందని, ఇక నుంచి చురుగ్గా ముందుకు వెళ్లాలని సూచించారు. అంతకు ముందు నియోజకవర్గాల ఇన్‌చార్జులు, అభ్యర్థుల అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రచారం ఎలా ఉందని ఆరా తీశారు.
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు, అభ్యర్థులు సోమవారం (ఏప్రిల్ 15) నుంచి నియోజకవర్గాల్లోనే ఉండాలని, హైదరాబాద్‌లో కనిపించవద్దని స్పష్టం చేశారు. పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కొందరు నేతల తీరు బాగా లేదని, మారాలని హెచ్చరించినట్లు తెలిసింది.
నేతలంతా కష్టపడితే 15 సీట్లు మనవే: రేవంత్
నేతలంతా కష్టపడితే 15 సీట్లు తప్పకుండా సాధిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నాలుగు నెలలుగా ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ హామీలు, ఇతర పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మండల స్థాయి, పోలింగ్ బూత్ స్థాయికి వెళ్లి ప్రచారం చేయాలని పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయాలన్నారు. పార్టీ కోసం పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు వేణుగోపాల్‌కు రేవంత్‌రెడ్డి, భట్టి, దీపా దాస్ మున్షీ స్వాగతం పలికారు. మిగిలిన మూడు నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనపై సీఎం, నేతలతో వేణుగోపాల్ చర్చించినట్లు తెలుస్తోంది.