Soumya Swaminathan : తండ్రికి తగ్గ తనయ..ప్రపంచ ఆరోగ్య సంస్థలో సౌమ్య స్వామినాథన్!
Soumya Swaminathan : డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన భారతీయ వైద్యురాలు. 2017లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా చేరారు. ఈ పదవిని అలంకరించిన తొలి భారతీయురాలు ఆమె. 2019లో గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ గా కూడా ఎంపికయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో అత్యున్నత పదవిలో ఉంటూ ప్రపంచ ఆరోగ్యానికి విశేష సేవలు అందిస్తున్న సౌమ్య స్వామినాథన్ భారత దేశానికి మంచి గుర్తింపు తెస్తున్నారు.
సౌమ్య స్వామినాథన్.. భారతదేశ హరిత విప్లవ పితాహహుడు ఎంఎస్ స్వామినాథన్, విద్యావేత్త మీనా స్వామినాథన్ కుమార్తె. మద్రాస్ లో జన్మించారు. సౌమ్య స్వామినాథన్ ట్యూబర్ కులోసిస్ పై రీసెర్చ్ చేశారు. ఈమె ఢిల్లీలోని ఎయిమ్స్ లోనూ, పుణేలోని ఎఫ్ఎంసీలో చదివారు. ఆతర్వాత అమెరికా, బ్రిటన్ లలో ఉన్నత విద్యనభ్యసించారు. ఈమె పిల్లల వైద్యురాలే కాదు పరిశోధకురాలు కూడా. ఈమె భర్త అజిత్ యాదవ్. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
2009 నుంచి 2011 వరకు సౌమ్య జెనీవాలోని ఉష్ణమండల వ్యాధుల పరిశోధన, శిక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమానికి సమన్వయ కర్తగా ఉన్నారు. 2013 వరకు చెన్నైలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యుబర్ కులోసిస్ డైరెక్టర్ గా ఉన్నారు. 2015నుంచి 2017వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ గా, భారత ప్రభుత్వానికి ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శిగా పనిచేశారు.
2017 నుంచి 2019వరకు సౌమ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనగరల్ గా ఉన్నారు. 2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త అయ్యారు. అక్కడ ఆమె ముఖ్యంగా కోవిడ్ -19 మహమ్మారిపై, సార్స్ కోవ్-2 వైరస్ జీనోమ్ సీక్వెనింగ్ , పలు ప్రాజెక్ట్ లను చేపట్టారు. 2021లో యూరోపియన్ కమిషన్ మరియు జీ 20 నిర్వహించిన గ్లోబల్ హెల్త్ సమ్మిట్ సన్నాహాల్లో స్వామినాథన్ ఉన్నత స్థాయి సైంటిఫిక్ ప్యానల్ లో సభ్యురాలిగా పనిచేశారు.
కాగా, సౌమ్య స్వామినాథన్ భవిష్యత్ రోజుల్లో ఆరోగ్య రంగంలో కీలక పదవిని చేపట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థగా డైరెక్టర్ జనరల్ గా ఆమె పదవిని చేపడితే ఆ విషయం భారత దేశం గర్వకారణం అని చెప్పొచ్చు.