Surinder Chawla : పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సీఈవో సురీందర్ చావ్లా రాజీనామా..ఎందుకంటే..

Surinder Chawla

Surinder Chawla

Surinder Chawla : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సురీందర్‌ చావ్లా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పాటు మెరుగైన కెరీర్‌ అవకాశాలను అన్వేషించడంలో భాగంగానే ఆయన తన పదవి నుంచి వైదొలిగినట్లు పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ధ్రువీకరించింది. ఏప్రిల్‌ 8న రాజీనామా సమర్పించారని బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 

గతేడాది జనవరిలో పీపీబీఎల్‌ ఎండీ, సీఈఓగా సురీందర్‌ చావ్లా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్‌బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చావ్లా రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పీపీబీఎల్‌పై RBI ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 2024 ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లను స్వీకరించొద్దని ఆదేశించింది. వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు చేయొద్దని తెలిపింది. తర్వాత ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. ఆర్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పార్ట్‌ టైమ్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బాధ్యతల నుంచి విజయ్‌ శేఖర్‌ శర్మ వైదొలిగారు.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం 2024 ఫిబ్రవరిలో పేటీఎం మార్కెట్ వాటా 11 శాతంగా ఉంది. మార్చిలో ఇది 9 శాతానికి తగ్గింది. అంటే కేవలం నెల రోజుల్లోనే 2 శాతం మార్కెట్ వాటాను పేటీఎం కోల్పోయింది. ఫిబ్రవరిలో కంపెనీ 1.3 బిలియన్ల యూపీఐ లావాదేవీలు నిర్వహించింది. 2024 జనవరిలో ఇది 1.4 బిలియన్లుగా ఉంది. పేమెంట్స్ బ్యాంకు మీద ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి ఈ సంఖ్య నెలనెలా తగ్గుతూ వస్తోంది.

TAGS