Earthquakes : ఈ జోన్లలో భూకంపాలు ఎక్కువ.. తెలుగు రాష్ట్రాలు ఏ జోన్లో ఉన్నాయో తెలుసా?
Earthquakes : ఎలాంటి హెచ్చరికా లేకుండా వచ్చి వందలాది, వేలాది ప్రాణాలను తీసుకెళ్లే ప్రకృతి విపత్తుల్లో భూకంపం అతి పెద్దది. ఇది వచ్చిందంటే చాలు.. ప్రాణాలతో పాటు ఆస్తులు కూడా మట్టిపాలు కావల్సిందే. ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో, భూకంపాలు వరుసగా తైవాన్, భారత్ లోని హిమాచల్ ప్రదేశ్, అమెరికాలోని న్యూయార్క్ లో సంభవించాయి.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) తెలిపిన వివరాల ప్రకారం.. భారత ఉపఖండంలో హిమాలయన్ బెల్ట్ లో 8.0 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందట. భారత్ లో భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాల గురించి తెలుసుకుందాం.
సిస్మిక్ జోన్స్.. అంటే ఏంటి?
భూమి క్రస్ట్‌లో టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి. ఐతే.. ఇవి నిరంతరం నెమ్మదిగా కదులుతూనే ఉంటాయి. సాధారణంగా వీటి మధ్య రాపిడి, ఢీ కొట్టుకునే సందర్భాలు రావు. అలా వచ్చాయంటే దాన్నే భూకంపం అంటారు. భారత్‌లో భూకంప జోన్లను నాలుగు రకాలుగా విభజించారు. జోన్ II, III, IV, V.
Zone V: ఈ జోన్ జమ్ము-కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్ తూర్పు భాగం, గుజరాత్ కచ్, ఉత్తర బీహార్‌లో కొంత భాగం, భారత్ లోని అన్ని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ అండ్ నికోబార్ దీవులను కవర్ చేసే జోన్.. ఇది చాలా తీవ్రమైన భూకంపాలు సంభవించే జోన్. అత్యంత భారీ భూకంపాలు ఈ జోన్ లోనే సంభవిస్తుంటాయి.
Zone IV: ఇది లడఖ్, జమ్ము-కశ్మీర్‌లోని మిగిలిన భాగాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, పంజాబ్‌లో కొన్ని భాగాలు, ఢిల్లీ, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌లో ఉత్తర భాగం, బిహార్, పశ్చిమ బెంగాల్ కు సంబంధించి చిన్న భాగాలు వంటివి ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. పశ్చిమ తీర సమీపంలో గుజరాత్, మహారాష్ట్రలో చిన్న భాగాలు, పశ్చిమ రాజస్థాన్‌లో చిన్న భాగం కూడా ఇందులోకే వస్తాయి. ఇక్కడ భారీ భూకంపాలు వస్తుంటాయి.
Zone III: ఇది మోస్తరు-తీవ్రత ఉన్న జోన్. కేరళ, లక్షద్వీప్ దీవులు, గోవా, ఉత్తరప్రదేశ్, హర్యానాలో కొన్ని భాగాలు, గుజరాత్, పంజాబ్‌లో మిగిలిన భాగాలు, పశ్చిమ బెంగాల్లో కొన్ని భాగాలు, పశ్చిమ రాజస్తాన్, మధ్యప్రదేశ్, బిహార్‌లో మిగిలిన భాగం, జార్ఖండ్ ఉత్తర ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ భారీ భూకంపాలు వచ్చే అవకాశాలు తక్కువ.
Zone II: రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు ఇది కవర్ చేస్తుంది. తక్కువ-తీవ్రత కలిగిన జోన్. ఈ జోన్లో భూకంపాలు వచ్చినా.. వచ్చినట్లు అనిపించదు. అంత తక్కువ తీవ్రతతో వస్తాయి.
తెలుగు రాష్ట్రాలు జోన్ II, IIIలో ఉన్నాయి. అందువల్ల భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువ. ఎప్పుడైనా వచ్చినా అవి చిన్న, మధ్య స్థాయిలో ఉంటాయి. అందువల్ల ప్రపంచంలోని బడా కంపెనీలు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఇష్టపడతాయి.