Autism : అండగా ఉంటే ‘ఆటిజం’ పెద్దజబ్బే కాదు!
Autism : కొందరు పిల్లలు చలాకీగా ఉంటారు. ఏదన్నా చెప్తే చాలు ఇలా నేర్చేసుకుంటారు. ఇతరులతో సులభంగా కలిసిపోతారు. ఆట,పాటల్లో ముందుంటారు. చురుకుగా ఉంటూ చదువుల్లోనూ, చేసే పనుల్లోనూ ప్రతిభ చూపుతుంటారు. కానీ కొందరు పిల్లలు మాత్రం సరిగా మాట్లాడలేకపోవడం, భాషా, భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలు లేకపోవడం గమినిస్తాం. చేసిన పనులనే చేయడం, ఒకే రకంగా ప్రవర్తించడం, ఏ విషయంపైనా ఆసక్తి లేకపోవడం వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతుంటారు. వాస్తవానికి మనం పుట్టిన దగ్గర నుంచే పరిసరాలను గమనిస్తూ పెరుగుతాం. చిన్నప్పుడు తల్లి కళ్లను చూసి, ఆతర్వాత ఆమె నవ్వితే నవ్వడం..ఇలా అక్కడి నుంచి మొదలవుతుంది నేర్చుకోవడం. కానీ రెండో తరహా పిల్లల్లో ఇది లోపిస్తుంది. ఈ సమస్యను ‘ఆటిజమ్’గా వైద్య పరిభాషలో పిలుస్తారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ‘‘ప్రపంచ ఆటిజమ్ అవగాహన దినోత్సవాన్ని ప్రతీ ఏడాది ఏప్రిల్ 2’’న నిర్వహిస్తున్నారు.
ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ?
– ఆటిజమ్ పై 18 డిసెంబర్ 2007 న ఆమోదించిన ఒక తీర్మానం ద్వారా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రపంచ ఆటిజమ్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించింది. ఈ వ్యాధితో బాధపడే పెద్దలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల జీవితాలను మెరుగుపరచి, వారికి తోడ్పాటును అందించడం కోసం ఈ తీర్మానాన్ని ఆమోదించారు.
– 2008 నుంచి ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచ ఆటిజమ్ అవగాహన దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
అసలు ఆటిజమ్ అంటే ఏమిటి?
– కొందరు పిల్లలు ఎవరితోనూ కలవకపోవటం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం వంటి భిన్న లక్షణాలను కలిగి ఉంటే వారికి ఆటిజమ్ ఉన్నట్టు.
– ఆటిజమ్ భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగుదల సమస్య. దీన్నే పర్వేసివ్ డెవలప్ మెంటల్ డిసార్డర్స్ అంటారు. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనబడతాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది.
ఎలా గుర్తించాలి..?
* మరీ చిన్నవయసులో..
* అకారణంగా నిరంతరంగా ఏడ్వడం
* గంటల తరబడి స్థబ్ధుగా ఉండడం
* తల్లి దగ్గరకు తీసుకుంటున్నా పెద్దగా స్పందించకపోవటం
* పరిచిత వ్యక్తులను చూడగానే నవ్వకపోవటం
* తల్లిదండ్రులు రమ్మని చేతులు చాచగానే ఉత్సాహంగా ముందుకు రావాల్సిన పిల్లల్లో అలాంటి స్పందనలేవీ కనిపించకపోవటం.
కాస్త పెద్దవయసులో..
* మిగతా పిల్లలతో కలవకపోవటం
* పిలిస్తే పలకకపోతుండటం
* పెరిగే కొద్దీ ఒంటరిగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతుండటం
* మనుషుల కంటే బొమ్మలు, వస్తువులపై ఆసక్తి ఎక్కువగా ఉండడం
* ఎవరైనా పలకరించినా వెంటనే సమాధానం ఇవ్వకపోవడం
* కళ్లలో కళ్లు పెట్టి చూడకపోతుండడం
* ముఖంలో భావోద్వేగాలేవీ చూపించకపోతుండటం
ఎలాంటి చికిత్స అవసరం..
– ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకూ పిల్లలతో మాట్లాడుతుండడం, సంభాషణా సామర్థ్యం పెరిగేలా చూడటం అవసరం. దీనికి స్పీచ్ థెరపీ దోహదం చేస్తుంది. కళ్లలో కళ్లు పెట్టి చూడటాన్ని అలవాటు చేసేందుకు శిక్షణ, అలాగే మలమూత్ర విసర్జన కోసం టాయ్ లెట్ ట్రైనింగ్ వంటివన్నీ పద్ధతి ప్రకారం నేర్పిస్తారు. క్రమేపీ స్థాయులను పెంచుకుంటూ వెళతారు. దీంతో మెదడులో లోపం క్రమేపీ సర్దుకుంటుంటుంది.
– ఆటిజం పిల్లలు చేతులు ఊపటం వంటివి అదేపనిగా చేస్తుంటారు. మొండితనం ప్రదర్శిస్తుంటారు. వీటిని మాన్పించడానికి బిహేవియర్ మోడిఫికేషన్ చికిత్స ఉపయోగపడుతుంది. ఇందులో ఆయా అలవాట్లను బట్టి సరిచేయడానికి ప్రయత్నిస్తారు.
– ఆక్యూపేషన్ థెరపీ ద్వారా జ్ఞానేంద్రియ సమస్యలు ఉన్నట్టయితే ఒత్తిడి, స్పర్శ వంటి పద్ధతులతో చికిత్స చేస్తారు. శరీరానికి రకరకాల ఆకారాలు తాకించడం, వాటిని ముట్టుకునేలా చేయడం వంటి వాటితో భయాలు పోగొడుతారు.
– కోపం, మొండితనం, చెప్పిందే చెప్పడం, ఉద్రిక్తత వంటివి గలవారికి మందులూ అవసరమవుతాయి. కుదురుగా కూర్చుని నేర్చుకోవడానికి, చదువుకోవడానికి ఇవి దోహదం చేస్తాయి.