Congress : కాంగ్రెస్ లో ఎంపీ అభ్యర్థులు లేరా? అరువు నేతలు అవసరమా?
Congress : తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు సత్తా చాటాలని తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య అయితే.. కాంగ్రెస్ లో రేవంత్ నాయకత్వ పటిమకు పెద్ద పరీక్ష. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనీసం 12 సీట్లు గెలుస్తుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే తాము 14 సీట్లు గెలవబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో వలసలు, చేరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలకు నేతలు క్యూ కడుతున్నారు.
రెండు, మూడు రోజులుగా బాగా చర్చనీయాంశమైన విషయం కడియం, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరడం. ఏ పార్టీ మీదయితే పోటీ చేసి గెలవాలో వారే వచ్చి తమ అభ్యర్థిగా పోటీ చేయమంటే ఎవరైనా వద్దంటారా? అదే కడియం కావ్య విషయంలోనూ జరిగింది. మొదట బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కావ్య ను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. అన్నీ రకాలుగా ఆలోచించుకున్న కావ్య, ఆమె తండ్రి శ్రీహరి కాంగ్రెస్ ప్రతిపాదనకు ఓకే అనడమే కాదు ఆ పార్టీలో చేరారు కూడా.
చాలా కాలంగా కావ్య క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే ఎమ్మెల్యేగా ప్రయత్నించారు కానీ కుదర్లేదు. ఇక కాంగ్రెస్ నుంచి అయాచితంగా వచ్చిన అవకాశాన్ని ఆమె కాదనుకోలేదు. ఆ పరిణామం తెలంగాణ రాజకీయాల పరంగా రెండు విషయాలను స్పష్టం చేస్తున్నది. 1. వరంగల్ లోక్ సభ స్థానంలో తమ పార్టీ నుంచి దీటైన అభ్యర్థిని నిలబెట్టలేని బలహీన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండడం. 2. కడియం శ్రీహరికి, బీఆర్ఎస్ కు వరంగల్ లోక్ సభ పరిధిలో తగిన పట్టు ఉందని అంగీకరించడం.
బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలనే వ్యూహంలో భాగంగా ఆ పార్టీ వారికి పదవులు అప్పగించడం తెలంగాణ కాంగ్రెస్ లోని కొందరు నేతలకు అసలు నచ్చడం లేదు. కాకపోతే ఈ సమయంలో ఎవరు బయటకు మాట్లాడడం లేదు. తమ పార్టీలో గెలపు గుర్రాలు లేవా? వైరిపక్షం నుంచి ఎందుకు అరువు తెచ్చుకోవాలి? అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ లో ఎంపీ స్థానాలకు పోటీ చేసే స్థాయిలో అభ్యర్థులు లేరా? అనే గుసగుసలు వినపడుతున్నాయి.
ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన 14 ఎంపీ స్థానాల్లో నలుగురు బీఆర్ఎస్ కు చెందినవాళ్లే. మరి పిలిచి ప్రత్యర్థి పార్టీలోని వారికి అవకాశం ఇవ్వడం పీసీసీ నేతగా రేవంత్ ది సాఫల్యామా? వైఫల్యామా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ కు నిజంగా బలం లేదా? కేవలం వాపేనా? అని అంటున్నారు. ఏదిఏమైనా గతంలో బీఆర్ఎస్ చేసినట్టుగానే కాంగ్రెస్ చేస్తుండడంతో దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.