BRS : నమ్మి పదవులిస్తే మోసం చేసి వెళ్తారా? పార్టీ మారిన నేతల ఓటమే బీఆర్ఎస్ టార్గెట్
BRS : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కోట్లు సంపాదించుకుని, పార్టీ అధికారం కోల్పోగానే కాంగ్రెస్ లో జంప్ అయిన నేతలపై గులాబీ పార్టీ గుర్రుమంటోంది. పార్టీకి ద్రోహం చేసి మోసం చేసి పోయిన నేతలను ఓడించి తీరాలని బీఆర్ఎస్ కంకణం కట్టుకుంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లను ఓడించి తీరుతామని ముఖ్యనేతలు పంతం పట్టారు. తాము గెలవకపోయినా ఫర్వాలేదు వారు మాత్రం ఓడాలన్న వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నారు.
నమ్మించి మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాలన్నదే తమ టార్గెట్ అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కడియం పార్టీ మార్పు బీఆర్ఎస్ పెద్దలను ఎక్కువ బాధపెట్టింది. కడియం కోసం కీలకనేతలను వదులుకున్నారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేశ్, తాటికొండ రాజయ్య..కడియం వల్లే పార్టీకి దూరమయ్యారు. అందరినీ వదులుకుని కడియంకు ఆయన కుమార్తెకు ప్రాధాన్యం ఇస్తే కృతజ్ఞత లేకుండా మోసం చేశారన్న కోపం బీఆర్ఎస్ హైకమాండ్ లో కనిపిస్తోంది.
రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చి, చేవెళ్ల ఎంపీని చేస్తే ఆయన కూడా ఇప్పుడు మోసం చేశారు. దానం నాగేందర్ వ్యవహారంపైనా బీఆర్ఎస్ ముఖ్యులు రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి, కేసీఆర్ ప్రగతి భవన్ ను వీడిన తర్వాత, ఆయన ఎక్కడుండాలనే చర్చ జరిగినప్పుడు.. ‘‘నాకు జూబ్లీహిల్స్ లో పెద్ద ఇల్లు ఉంది. మీరు నా తండ్రి లాంటి వారు, మీరు నా ఇంట్లో ఉండొచ్చు’’ అంటూ ప్రకటించిన దానం.. ఇప్పుడు పార్టీ మారిపోయారు. వీరందర్నీ ఓడించడమే టార్గెట్ గా బీఆర్ఎస్ పెట్టుకుంది.
నమ్మి అవకాశాలిస్తే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వీడి తమ స్వార్థాన్ని బయటపెట్టుకున్న నేతల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని ఘోరంగా ఓడించాలని అధిష్ఠానం భావిస్తోంది. రాజకీయాల్లో ఎంతో కొంత విలువలు ఉండాలని, ఇలాంటి విలువలు లేని రాజకీయ నాయకుల పనిపట్టడం ద్వారా భవిష్యత్ లో ఎవరూ పార్టీలు మారేందుకు సాహసం చేయరని గులాబీ నేతలు అంటున్నారు. పార్టీ ఇప్పుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా.. తెలంగాణ బాగోగుల కోసం ఆలోచించేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని, ఈ విషయమై లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ తీర్పునిస్తారని చెబుతున్నారు.