CM Revanth : కేసీఆర్ స్ట్రాటజీనే అమలు చేస్తున్న రేవంత్!

CM Revanth

CM Revanth

CM Revanth : ఫక్తు రాజకీయ పార్టీ అంటే ఇప్పుడు అర్థం మారిపోయింది. ఒకప్పుడు రాజకీయాల్లో ఎంతో కొంత విలువలు ఉండేవి. తమ వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నష్టం జరిగితే ప్రజాప్రతినిధులు రాజీనామా చేసేవారు. కానీ ఇప్పటి ప్రజాప్రతినిధులు తమ స్వార్థం కోసం అధికార పార్టీలోకి జంపై కూడా రాజీనామాలు చేయడం లేదు. ఓ పార్టీ ద్వారా తమకు ఓటేసిన ఓటర్లను నిండా ముంచుతూ ఇతర పార్టీల్లోకి దూకుతున్నారు.

2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వెల్లువలా అందులోకి వెళ్లారు. 2018లో రెండో విడత కూడా గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను గంపగుత్తగా తమ పార్టీలో జాయిన్ చేసుకున్నారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ గెలుపును బీఆర్ఎస్, బీజేపీ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. పైగా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని స్టేట్ మెంట్లు ఇచ్చేశారు. కేసీఆర్ అయితే ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీని బలోపేతం చేసేందుకు గేట్లు ఎత్తేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, సీనియర్ నేతల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

దీంతో బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లోకి క్యూ కట్టేశారు. రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, దానం నాగేందర్, పసునూరి దయాకర్, సీతారాం నాయక్, కె.కేశవరావు, ఆయన కూతురు విజయలక్ష్మి, కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య..ఇలా ఎంతో మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇందులో పలువురికి ఎంపీ సీట్లు ఖరారు చేశారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. వీరు మాత్రమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

భారత రాష్ట్ర సమితి నాయకులు మాత్రమే కాకుండా పలువురు  బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు ముందు చాలా మంది బీజేపీ అసంతృప్త నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వాన్ని కూలగొడుతామని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి అటు పార్టీని కాపాడుకుంటునే.. ఇటు ప్రభుత్వాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందో గాని ప్రస్తుతానికి కేసీఆర్ 2014లో అనుసరించిన వ్యూహమే రేవంత్ అనుసరిస్తున్నారు. మరి ఈ విషయమే కేసీఆర్ కొంపముంచింది..ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. దీన్ని రేవంత్ ఎలా సమర్థించుకుంటారో.. ప్రజల్లో వ్యతిరేకతను ఎలా తప్పించుకుంటారో మున్ముందు రోజుల్లో తెలియనుంది.

TAGS