Power Politics : అధికారం శాశ్వతం కాదని ఇప్పుడు అర్థమైందా?
Power Politics : ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత రాజకీయాలకు సరిగ్గా వర్తిస్తుంది. అధికారం ఎవరికైనా కొన్ని రోజులే ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు మహారాజా యోగం అనుభవిస్తారు. అధికారం కోల్పోయిన తర్వాతే తెలుస్తుంది ఏదీ శాశ్వతం కాదని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘ఒక్క చాన్స్’ అని అడిగినవారు, అధికారంలోకి వచ్చాక ‘ఎప్పటికీ మేమే ఉంటాం.. లేదా ఉండాలి..’’ అన్నట్లు మాట్లాడుతుండడం మనం వింటూనే ఉంటున్నాం.
అయితే మన ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యం కాదని పలుమార్లు నిరూపితమైనప్పటికీ, అది తమ పార్టీకి వర్తించదనే భ్రమలో ఉండగానే అధికారం కోల్పోతారు కేసీఆర్ లాగా. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కేసీఆర్, కేటీఆర్ లకు చాలా కష్టమే. ఈలోగానే పార్టీ ఖాళీ అయిపోతుండడం, లోక్ సభ ఎన్నికలు రెండూ కూడా మూలిగే నక్కపై తాటిపండు పడడమే. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారి గురించి కేటీఆర్ మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. ‘‘ఆనాడు కేసీఆర్ చేరదీసి పదవులిస్తే, వారందరూ ఇప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లిపోతున్నారు. తిరిగి కేసీఆర్ మీద నిందలు కూడా వేస్తున్నారు. కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే హాయిగా నవ్వుకుంటూ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు నేతలపై బీఆర్ఎస్ పగ తీర్చుకోవాల్సిందే.
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్నట్లు పార్టీని వీడి వెళ్తున్న నేతలే శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచారు. అధికారం శాశ్వతమనుకుని వారు కష్టకాలంలో పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కానీ రేపు మనం అధికారంలోకి వచ్చినప్పుడు మళ్లీ వాళ్లందరూ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా చేర్చుకునే ప్రసక్తే లేదు. కేసీఆర్ నాయకత్వంలో నికార్సైన నాయకులు, ఉద్యమకారులతో పార్టీని పునర్నిర్మించకుందాం’’ అంటూ కేసీఆర్ ప్రసంగించారు.
కేటీఆర్ మాటలు వింటే ఎవరికైనా నవ్వురాక మానదు. ఆనాడు బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలను ఖాళీ చేశారు. తెలంగాణ కోసం పోరాడిన కోదండరామ్ వంటి వారిని తరిమికొట్టి ఇతర పార్టీల నేతలు, ఎమ్మెల్యేలను తెచ్చుకున్నారు. అప్పుడు విమర్శలు వస్తే ‘‘ఇప్పుడు మాది ఉద్యమపార్టీ కాదు పక్కా రాజకీయ పార్టీ’’ అంటూ కేసీఆర్ గట్టిగా సమర్థించుకున్నారు.
మరో 25-30ఏండ్లు తామే అధికారంలో ఉంటామన్న కేటీఆర్ నోటి వెంట ఇప్పుడు అధికారం శాశ్వతం కాదనే మాటలు వస్తున్నాయి. కేటీఆర్ కు కాస్త ఆలస్యంగానైనా ప్రజాస్వామ్య తత్వం బోధపడిందని అర్థమవుతోంది. కానీ చేయకూడనివన్నీ చేసినా, తప్పులు చేశామని ఒప్పుకోకుండా, ఎదుటివారిని నిందిస్తుండడం, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతోందని కలలు కంటుండడం గమనిస్తే నేటికీ కేసీఆర్, కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదని అర్థమవుతోంది. వారు ఇకనైనా మారకుంటే వారి భవిష్యత్ ను వారే దెబ్బతీసుకున్నవారవుతారు.