Raghurama : కూటమి అభ్యర్థిగా రఘురామ? త్వరలోనే నిర్ణయం..!

Raghurama

Raghurama

Raghurama : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. అయితే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కూటమి సీటు ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత వైఎస్ జగన్ తో విభేదించారు. ప్రతీ సందర్భంలోనూ జగన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్రను పోషించారు. ఏ పార్టీలో చేరకుండా జగన్ కు పక్కలో బల్లెంలా తయారయ్యారు. పలు సందర్భాల్లో టీడీపీ, జనసేన ఆయనకు సపోర్ట్ గా ఉంటూ వచ్చాయి. కాగా, ఈ ఎన్నికల్లో కూటమి  నరసాపురం టికెట్ రఘురామకృష్ణంరాజుకే దక్కుతుందని అంతా భావించినా ఆయనకు టికెట్ కేటాయించలేదు. ఈ విషయం ప్రజల్లో బాగా చర్చనీయాంశమైంది. దీంతో కూటమి పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీఏ కూటమిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. త్వరలో కూటమి ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రఘురామ ఎన్నికల బరిలో ఉండడం ఖాయమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆయనకు సీటు ఇవ్వడంపై మూడు పార్టీలు చర్చిస్తున్నాయి.

అయితే అసెంబ్లీ అభ్యర్థిగానా? లేక ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారా? అనే సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే మూడు పార్టీలు అభ్యర్థులను ప్రకటించినందున..వాటిలోనే సీటు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన నివాసంలో గురువారం రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఇటీవల కూటమి అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఈ ప్రాంత ప్రజలు విస్మయానికి గురయ్యారన్నారు. త్వరలోనే తనపేరు కూటమి నేతలు ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎవరికీ భయపడలేదని, తన ఒక్కడికే భయపడ్డాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని తన స్నేహితులను కలుస్తున్నానని, టికెట్ వచ్చిన వెంటనే ప్రచారంలో ఉంటానని తెలిపారు. తనకు సీటు రాకుండా జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ పై ఒంటరి పోరాటం చేస్తోన్న రఘురామకు ఎన్డీఏ కూటమి నరసాపురం టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన అభిమానులు కోరుతున్నారు.

TAGS