Mangalagiri : లోకేశ్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది.. కలెక్టర్ చెప్పినా అధికారిని బదిలీ చేయరా?
Mangalagiri : ఏపీలో రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం గల నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. ఇక్కడి నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో భాగమైన మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థకు ఇదే జిల్లాకు చెందిన నిర్మల్ కుమార్ ను ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందే వ్యూహాత్మకంగా కమిషనర్ ను నియమించి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆయన ఇదే(సొంత) జిల్లాకు చెందిన వారని జిల్లా కలెక్టర్ సైతం ధ్రువీకరించినా కమిషనర్ బాధ్యతల్లో స్వల్ప మార్పులు చేసి ఆయననే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కొనసాగించడం విశేషం.
నిబంధనల ప్రకారం మంగళగిరి కమిషనర్ గా ఉన్న నిర్మల్ కుమార్ ను బదిలీ చేయాలి. ఈ విషయాన్ని గుంటూరు కలెక్టర్ గతంలోనే మున్సిపల్ పరిపాలనా శాఖకు లేఖ రాశారు. అయినా నిర్మల్ కుమార్ ను ఉన్నతాధికారులు బదిలీ చేయలేదు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మరోసారి నిర్మల్ కుమార్ స్థానికుడు అనే విషయాన్ని గుర్తు చేస్తూ లేఖ రాశారు.
అయినా కమిషనర్ గా నిర్మల్ కుమార్ ఇక్కడే కొనసాగుతారని పేర్కొంటూ.. ఆయన స్థానంలో ఎన్నికల విధులకు మాత్రం నగరపాలక సంస్థలో ఆడిట్ శాఖ ఉపసంచాలకుడిగా ఉన్న ఎగ్జామినర్ ను వినియోగించుకోవాలని సూచిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఎన్నికల విధుల్లో కమిషనర్ పాల్గొనరని చెప్పినప్పటికీ మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయన పరిధిలోనే పనిచేస్తారు. ఆయన ఎన్నికల్లో నేరుగా కీలక బాధ్యతలు నిర్వహించకపోయినా పరోక్షంగా సిబ్బందిని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. అధికార పార్టీకి సహకారం అందించాలన్న దురుద్దేశంతోనే కమిషనర్ ను బదిలీ చేయకుండా ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పినట్లు తెలిసింది. ఇక్కడి నుంచి నారా లోకేశ్ పోటీ చేస్తుండడంతో ఉద్దేశపూర్వకంగానే కమిషనర్ ను బదిలీపై పంపకుండా వ్యూహం అమలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మల్ కుమార్ మున్సిపల్ శాఖకు చెందిన వారు కాదు. ఆయన కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై రాష్ట్రానికి వచ్చారు. ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో పనిచేస్తూ మంగళగిరి కమిషనర్ గా నియమితులయ్యారు.