Digital Campaign : డిజిటల్ ప్రచారమే బెటర్ గురూ.. సమయం, ఖర్చూ ఆదా..
Digital Campaign : దేశంలో ఎటు చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. కేంద్రంలో మూడో సారి అధికారంలోకి రావడం పక్కా అని బీజేపీ నమ్మకంగా ఉంది. ఆ పార్టీకి అడ్డుకట్ట వేసి అధికారం చేపట్టాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గట్టాయి. ఇప్పటికే అభ్యర్థులను అన్ని పార్టీలు దాదాపు ఖరారు చేశాయి. ఇక తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముక్కోణ పోటీ హోరాహోరీ సాగనుంది.
ఇప్పుడు అన్ని పార్టీల ఫోకస్ ప్రచారంపైనే. ఎన్నికల్లో గెలవాలంటే తగిన ప్రచారం చేయాల్సిందే. ప్రజల మనుసులను గెలవడం ద్వారా మాత్రమే గెలవగలుగుతారు. ప్రజలను ఆకట్టుకునే మ్యానిఫెస్టో తయారు చేసుకోవాలి. తమ పార్టీ గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పే ఈ మ్యానిఫెస్టో ఎంతో కీలకం. దీన్ని ప్రజలకు దగ్గరకు తీసుకెళ్లాలంటే ప్రచారం అవసరం. అందుకే ఇప్పుడందరూ ప్రచారంపై పడ్డారు. సమయం, డబ్బు ఆదా కావడమే కాదు స్వల్ప కాలంలో ప్రజల్లో చేరువయ్యే ఏకైక మార్గం డిజిటల్ ప్రచారం.
వాస్తవానికి సోషల్ మీడియా పవర్ ను గుర్తించింది బీజేపీనే. అందుకే ఆ పార్టీ రెండు సార్లు అధికారంలోకి రాగలిగింది. డిజిటల్ ప్రచారంపై ప్రధాని మోదీ ఎక్కువ దృష్టి సారిస్తారు. ఒక ప్రభుత్వం చేసిన మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియాను మించింది లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేతలు సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నారు.
వాట్సాప్, ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ వంటి అకౌంట్ల ద్వారా అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. అభ్యర్థులు ఎవరికీ వారు డిజిటల్ ప్రచారం కోసం ప్రత్యేక టీంలను నియమించుకుంటున్నాయి. ఈ ప్రచారంలో తాము గెలిస్తే నియోజకవర్గాలను ఏం చేస్తామో చెప్పడంతో పాటు పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
గతంలో ఇంటింటి ప్రచారం చేసి ఊళ్లు తిరగాలంటే ఎంతో ఖర్చు అయ్యేది. కొన్ని గ్రామాలకు వెళ్లే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మారుమూల ఓటరును పలకరించవచ్చు. దీంతో డబ్బు, సమయం కూడా ఆదా అవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రచారాన్ని నిర్లక్ష్యం చేశారంటే ఓటమిపాలు అయినట్టే అని భావించవచ్చు.