BC Voters : అన్ని పార్టీలు మావాళ్లే అంటున్నాయి..మరి బీసీలు ఎవరి వైపు.. ?

BC Voters

BC Voters

BC Voters : భారత్ అంటేనే బీసీలు.. ఎందుకంటే జనాభాలో వీరు సగాని కంటే ఎక్కువ. వీరు లేనిదే దేశంలో ఏ పని సాగదు. చేతివృత్తుల దగ్గర నుంచి వ్యవసాయం దాక బీసీ కులాలే చేస్తాయి. అయినా కూడా ఇప్పటికీ బీసీలకు రాజ్యాధికారం రాలేదు. అంతెందుకు కీలక పదవులు కూడా ఇప్పటికీ రాలేదు. ఇక ఏపీలో బీసీల పరిస్థితిని చూస్తే జాలి వేయకమానదు. ఏపీ ఏర్పడిన 1956 నుంచి ఇప్పటివరకూ ఒక్క బీసీ కూడా సీఎం కాలేదు. ఇదొక్కటి చాలు రాష్ట్రంలో బీసీల పరిస్థితిని తెలుసుకునేందుకు.

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంతా రెడ్ల రాజ్యమే. బీసీలు ఓటు వేసే జనాలు, ప్రచారంలో నాయకుల వెంట పరుగెత్తే కార్యకర్తలు మాత్రమే. కానీ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి బీసీలకు మంచి అవకాశాలే ఇచ్చారు. ఇక అప్పట్నుంచి బీసీలు అసెంబ్లీకి వెళ్లగలిగారు. అయినా కూడా ఇప్పటికీ జనాభా తగ్గ ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయం. ఈక్రమంలో ప్రధాన పార్టీలు బీసీలను అవకాశవాదంతోనే వాళ్లను వాడుకుంటున్నాయనడంలో ఎలాంటి డౌట్ లేదు.

రాష్ట్రంలో టీడీపీ వెనకున్న బీసీలను తన వైపు తిప్పుకోవడానికి జగన్ బీసీలకు కార్పొరేషన్ పదవులతో పాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ టికెట్లు బాగానే ఇచ్చారు. ఇప్పుడు బీసీలు రెండు ప్రధాన పార్టీలకు మద్దతు దారులుగానే ఉన్నారు. ఇక తాజా ఎన్నికల కోసం జగన్ తాను పోటీ చేస్తున్న 175 సీట్లలో బీసీలకు 48 సీట్లు ఇచ్చారు. టీడీపీ ప్రస్తుతం ప్రకటించిన 139 సీట్లలో 29 మంది బీసీలకు అవకాశం ఇచ్చారు. ఇక జనసేన, బీజేపీల నుంచి కూడా బీసీలకు టికెట్లు దక్కనున్నాయి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అన్ని పార్టీలు గతంలో కన్నా బీసీలకు సీట్లు ఎక్కువ ఇచ్చాయి. ఇదొక్కటే బీసీలకు సంతోషం. ఇప్పుడున్న పార్టీలన్నీ అగ్రకులాల అధిపత్యంలో ఉన్నవే. జగన్, చంద్రబాబు, పవన్ వాటి అధినేతలుగా ఉన్నారు. వీరి నుంచి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మాత్రం ఇంకా చాలా దశాబ్దాలు పట్టవచ్చని మాత్రం చెప్పక తప్పదు.

TAGS