Chandrababu Vs Jagan : చంద్రబాబు పద్మవ్యూహం..జగన్ కు అంతా ఈజీ కాదేమో..

Chandrababu Vs Jagan

Chandrababu Vs Jagan

Chandrababu Vs Jagan : 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయానికి ఎన్నో కారణాలున్నాయి. 2014లో ఓడిపోయిన సానుభూతి, టీడీపీ పాలనపై సహజ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు జగన్ ఒక్కసారి చాన్స్ ఇవ్వండి అంటూ రాష్ట్రం ఆ కొస నుంచి ఈ కొస వరకు చేసిన పాదయాత్రలు ఆయనకు అధికారం తీసుకొచ్చాయి. పదేళ్లుగా నిత్యం ప్రజల్లో ఉండడం కూడా ఆయనకు బాగా కలిసొచ్చింది. జనాల్లో కూడా జగన్ పాలనను ఒక్కసారి చూద్దాం అని గంపగుత్తగా అందరూ ఆయనకే ఓట్లేశారు.

అయితే ఈసారి పరిస్థితులు వేరు. జగన్ పాలనను ఐదేండ్లు చూశారు. ఆయన వైఖరి ఏంటో అర్థమైపోయింది. ఒకప్పుడు నిత్యం ప్రజల్లో ఉన్న ఆయన ఇప్పుడు ప్యాలెస్ లకే పరిమితం అయిపోయారు. బటన్లు నొక్కడం, ఓట్లు తెచ్చే ఏవో సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్ప నిరుద్యోగులకు, పేదలకు ఉపాధి కరువై పోయింది. పోలవరం కట్టలేదు. రాజధాని నిర్మించలేదు. మౌలిక సదుపాయాల కల్పన శూన్యం.. ఇలా ఎన్నెన్నో పాలనా వైఫల్యాలు..  రాబోయే ఎన్నికల్లో ఇవన్నీ జగన్ పై తీవ్ర ప్రభావం చూపేవే.

ఆయన పాలన పరిస్థితి ఇలా ఉంటే ప్రత్యర్థుల బలమైన ఎత్తుగడలను ఎదుర్కొవడం జగన్ కు కష్టంగానే ఉండబోతోంది. బలమైన ప్రతిపక్షం టీడీపీ, అపర చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు వేసిన పద్మవ్యూహం ఓ రేంజ్ లో ఉంది. ఒంటరిగా వెళ్తే ఓట్లు చీలుతాయనే ఉద్దేశంతో.. యూత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్ జనసేనతో పొత్తు, కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన బీజేపీతో జట్టుకట్టడం ఇవన్నీ జగన్ ను ఇరకాటంలో పెట్టేవే. మూడు బలమైన పార్టీలపై జగన్ ఒంటరి పోరు సాగించి గెలవడమనేది అంతా ఈజీ అయితే కాదు. జగన్ ను ఈ సారి ఎలాగైనా గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న వ్యూహరచన జగన్ అష్టదిగ్బంధనం చేస్తోంది.

జగన్  పాలనా పరంగా, రాజకీయ పార్టీలతోనే కాదు.. ఇంటి పోరుతో కూడా నైతికంగా దెబ్బతింటున్నారు. సొంత చెల్లి అన్న ఓటమే లక్ష్యంగా చేస్తున్న పోరును ప్రజలు గమనిస్తున్నారు. అలాగే వైఎస్ వివేకా హత్య కూడా జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సునీతా రెడ్డి  అన్న జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఏరకంగా చూసినా జగన్ కు నలువైపులా నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది. మరి ఈ సమస్యలను దాటుకుని టీడీపీ కూటమిని ఢీకొని గెలవడమంటే ఆషామాషీ మాత్రం కాదు. ఇది జగన్ కు కూడా బాగా ఎరుకే. కాకపోతే పైకి గాంభీర్యం చూపిస్తున్నారంతే.

TAGS