Vikasit Bharat : 14 రోజుల్లో రూ.8.25 లక్షల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు..
Vikasit Bharat : ‘వికసిత్ భారత్’ ఏర్పాటులో భాగంగా ప్రధాని మోదీ ఈ నెలలో కేవలం 14 రోజుల్లోనే రూ.8.25 లక్షల కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. 2024లో 75 రోజుల్లో రూ.11 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించామని, శంకుస్థాపనలు చేశామని, 10-12 రోజుల్లో రూ.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించామని ప్రధాని పేర్కొన్నారు.
రూ.1.25 లక్షల కోట్ల విలువైన 3 సెమీకండక్టర్ ప్రాజెక్టుకు బుధవారం (మార్చి 13) వర్చ్వల్ గా శంకుస్థాపన చేశారు, కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత శంకుస్థాపన చేసేందుకు కేవలం 15 రోజులు పట్టింది. దీంతో ప్రధాని మోదీ ప్రకటించిన అభివృద్ధి ప్రాజెక్టుల వ్యయం కేవలం 14 రోజుల్లోనే రూ.8.25 లక్షల కోట్లకు చేరింది.
మార్చి 1వ తేదీ జార్ఖండ్ లోని ధన్ బాద్ లో రూ.35,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఎరువులు, రైలు, విద్యుత్, బొగ్గు రంగాల్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి.
అదే రోజు పశ్చిమబెంగాల్ లోని హుగ్లీలోని ఆరాంబాగ్ లో రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రైలు, ఓడరేవులు, చమురు పైప్ లైన్, ఎల్పీజీ సరఫరా, మురుగునీటి శుద్ధి వంటి రంగాలతో అభివృద్ధి ప్రాజెక్టులు ముడిపడి ఉన్నాయి.
మార్చి 2వ తేదీ పశ్చిమబెంగాల్ లోని నదియా జిల్లా కృష్ణానగర్ లో విద్యుత్, రైలు, రోడ్డు తదితర రంగాలకు సంబంధించి రూ.15,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ ను వికసిత్ రాష్ట్రంగా మార్చే దిశగా ఇది మరో ముందడుగు అని ప్రధాని మోదీ అన్నారు.
అనంతరం బిహార్ లోని ఔరంగాబాద్ లో రూ.21,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. మార్చి 4వ తేదీ తెలంగాణలోని ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్లకు పైగా విలువైన విద్యుత్, రైలు, రోడ్డు రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
ఆ మరుసటి రోజే తెలంగాణలోని సంగారెడ్డిలో రూ.6,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రోడ్డు, రైలు, పెట్రోలియం, విమానయానం, సహజవాయువు వంటి కీలక రంగాలను ఈ ప్రాజెక్టులు కవర్ చేస్తాయి.
అనంతరం ఒడిశాలోని చండిఖోలేలో చమురు, గ్యాస్, రైల్వే, రోడ్డు, రవాణా, రహదారులు, అణుశక్తి రంగాలకు సంబంధించి రూ.19,600 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రకటించారు.
మెట్రో రైల్, రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) సహా పట్టణ మొబిలిటీ రంగానికి సేవలందించే రూ.15,400 కోట్ల విలువైన బహుళ కనెక్టివిటీ ప్రాజెక్టులకు మార్చి 6వ తేదీ ప్రధాని కోల్కతాలో శంకుస్థాపన చేశారు.
అసోంలోని జోర్హాట్ లో హెల్త్, గ్యాస్, రైల్, గృహ నిర్మాణ రంగాలకు సంబంధించి రూ.17,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ మార్చి 9న శంకుస్థాపన చేశారు.
ఆ తర్వాతి రోజు ఉత్తరప్రదేశ్ లోని అజంగఢ్ లో జరిగిన కార్యక్రమంలో రూ.34,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన ఆజంగఢ్ నేడు అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని అక్కడ నిర్వహించిన సమావేశంలో మోదీ అన్నారు.
మార్చి 11న హర్యానాలోని గురుగ్రామ్ లో సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన 112 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు దేశం ఆధునిక కనెక్టివిటీ దిశగా మరో పెద్ద, కీలక ముందడుగు వేసిందన్నారు.
2024లో 3 నెలల్లోనే రూ.10 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం లేదా వాటికి శంకుస్థాపన చేయడం జరిగిందని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ లో మార్చి 12న రూ.1,06,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
భారత సెమీ కండక్టర్ విధానానికి ఊతమిచ్చేలా సుమారు రూ.1.25 లక్షల కోట్ల విలువైన 3 సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. గుజరాత్ లోని ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (డీఎస్ఐఆర్)లో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ, అసోంలోని మోరిగావ్లోని ఔట్ సోర్సింగ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓశాట్) ఫెసిలిటీ, గుజరాత్లోని సనంద్ లో ఔట్ సోర్సింగ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓశాట్) ఫెసిలిటీని ప్రారంభించారు.
ఈ ప్రకటనలన్నింటితో ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి పనులు నిరంతరం విస్తరిస్తున్నాయని ప్రధాని నొక్కి చెప్పారు.