Tesla : ఈవీ పాలసీకి కేంద్రం ఆమోదం.. దేశంలోకి టెస్లా ఎంట్రీకి తెరుచుకున్న దారులు..
Tesla : ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వెహికిల్ హవా నడుస్తున్నది. పర్యావరణ హితం కావడంతో అందరూ వాటి వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఈవీల తయారీని ప్రోత్సహించేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం ఇ-వెహికిల్ పాలసీని(e-vehicle policy) తీసుకొచ్చినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని వల్ల దేశం ఈవీల తయారీకి గమ్యస్థానంగా మారడంతో పాటు అంతర్జాతీయ ప్రముఖ ఈవీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. దేశంలోకి ప్రవేశించేందుకు తహతహలాడుతున్న అమెరికా కార్ల తయారీ కంపెనీ టెస్లాకు ఈ పాలసీ ద్వారా మార్గం సుగమమైంది.
కొత్త ఈవీ పాలసీ ప్రకారం.. ఏదైనా కంపెనీ కనీసం రూ.4,150 కోట్లు (5వేల మిలియన్ డాలర్లు) దేశంలో పెట్టుబడిగా పెడితే పలు రాయితీలు లభిస్తాయి. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్త తరహ సాంకేతికత అందుబాటులో రావడంతో పాటు మేకిన్ ఇండియాకు ఊతం ఇచ్చినట్టు అవుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. పైగా పర్యావరణానికి మేలు జరుగుతుందని, క్రూడాయిల్ దిగుమతులు తగ్గి తద్వారా వాణిజ్య లోటు తగ్గుతుందని తెలిపింది.
దేశంలోకి ప్రవేశించాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న టెస్లాకు దేశీయంగా తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఈ పాలసీ వీలు కల్పిస్తోంది. దీనికింద 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి, మూడేళ్లలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది. దీంతో పాటు తయారీకి వినియోగించే విడి భాగాల్లో 25 శాతం స్థానికంగానే సమీకరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించిన కంపెనీలు 35వేల డాలర్ల కంటే అధిక ధర కలిగిన కార్లను 15 శాతం సుంకంతో ఏటా 8వేల ఈవీల కార్ల దిగుమతి చేసుకోవచ్చు.
ప్రస్తుతం కార్ల ధరను బట్టి 70-100 శాతం వరకు దిగుమతి సుంకాలు వర్తిస్తున్నాయి. ఇది టెస్లా ఎంట్రీకి అడ్డంకిగా మారింది. దీంతో సుంకాలు తగ్గించాలని ఆ కంపెనీ ఎప్పటినుంచో కోరుతోంది. కేంద్రం తాజా నిర్ణయంతో టెస్లా ఎంట్రీకి దారులు పరుచుకున్నాయి.