Pawan Kalyan : ఎట్టకేలకు ఉత్కంఠకు తెర..పిఠాపురం నుంచి పవన్

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జనసైనికులకు, ఫ్యాన్స్ కు పవన్ శుభవార్త చెప్పారు. తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటించి జనసేనాని అభిమానుల ఉత్కంఠకు తెరదించారు. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ సభలో ఈమేరకు పవన్ ప్రకటన చేశారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని, ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరిన రోజు నుంచి పవన్ ఎంపీ పోటీగా చేస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎంపీగా పోటీ చేస్తే సీఎం హోదాతో సమానమైన కేంద్ర మంత్రి పదవి ఇస్తామని బీజేపీ పెద్దలు సూచించనట్టుగా వార్తలు ప్రచారమయ్యాయి. అయితే వీటన్నంటికీ చెక్ పెడుతూ పవన్ తాను ఎమ్మెల్యేగానే బరిలో ఉంటానని తేల్చేశారు.

2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. పవన్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్లా ఓడిపోయారు. అయితే ఒంటరిపోరు చేయడం, మూడు పార్టీలు బరిలో ఉండడం, అప్పటికీ జనసేనకు క్షేత్రస్థాయిలో పట్టులేకపోవడం, జగన్ కు ఒక్కసారి అవకాశం ఇద్దామని జనాలు అనుకోవడం..వంటి కారణాలతో పవన్ ఓడిపోవాల్సి వచ్చింది.

గతానికి భిన్నంగా ప్రస్తుతం జనసేన గ్రాఫ్ పెరగడం, పొత్తులు, జగన్ ప్రభుత్వంపై పలు వర్గాల్లో వ్యతిరేకత వంటివి జనసేనకు ఈ సారి మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఇక పిఠాపురం నియోజకవర్గం కూడా పవన్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధికంగా కాపుల ఓట్లు ఇక్కడ 91వేలు ఉండడం, టీడీపీ, బీజేపీతో పొత్తు వంటివి కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడి వైసీపీ నుంచి వంగా గీత బరిలో నిలువనున్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును తప్పించి గీతకు అవకాశం ఇస్తున్నారు. అయితే పవన్ పోటీ చేస్తున్న నేపథ్యంలో కాపు నేత ముద్రగడను బరిలోకి దింపే అవకాశాలు కూడా ఉన్నట్టు ప్రచారమవుతోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో పిఠాపురమే అత్యంత క్రేజీ ఎన్నిక కానుంది.

TAGS