Praneeth Rao : గూఢచారి ‘గుట్టు’ విప్పేనా? ఫోన్ ట్యాపింగ్ డొంక కదిలేనా?
Praneeth Rao : జేమ్స్ బాండ్ సినిమాల్లో గూఢచారులను చూసుంటాం. గూఢచారి నంబర్ 1, గూఢచారి నంబర్ 116, జేమ్స్ బాండ్ 006 ..ఇలా ఎన్నెన్నో పేర్లతో బోలెడు సినిమాలు చూసుంటాం. ఈ సినిమాలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటాయి. వాటిలో కథానాయకుడు చూపే తెలివి మనల్ని అబ్బురపరుస్తుంది. అందుకే ఆ సినిమాలు పెద్ద హిట్ కొడుతుంటాయి. ఈ గూఢచారుల కాన్సెప్ట్ సినిమాల్లోనే కాదు రాజకీయరంగంలోనూ బాగానే ఉపయోగపడుతుంటాయి.
ఈ గూఢచారులు దేశ, రాష్ట్ర భవిష్యత్ కోసం పనిచేస్తుంటారు. కానీ వీరిని ప్రభుత్వాలు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయనే ఆరోపణలు బాగానే ఉన్నాయి. గూఢచారులను వాడుకుని తమ ప్రత్యర్థులు లోగుట్టు తెలుసుకుంటుంటారు. వారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరిని కలుస్తున్నారు? అంటూ ఇలా వారి వ్యక్తిగత విషయాలను, పార్టీ వ్యవస్థలను దొంగతనంగా తెలుసుకుని తమ ప్రయోజనాలకు వాడుకుంటుంటారు. ఇలాంటిదే తెలంగాణలో ఇటీవల సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గత ప్రభుత్వం ఓ అధికారి నేతృత్వంలో జరిపిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో, ఎవరి సూత్రధారులెవరో తెలియాల్సి ఉంది. తెలంగాణ నిఘా విభాగంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ)లో ఆధారాల ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు.. సస్పెండైన డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించింది.
అంతకుముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణ బృందం ప్రణీత్ రావును పలు ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టింది. ముఖ్యంగా ఆధారాల ధ్వంసానికి గల కారణాలను ఆరా తీసింది. ఆధారాల్ని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది. అందుకు ఎవరైనా ఆదేశించారా? సొంత నిర్ణయం మేరకే అలా చేశారా? ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఎందుకు ఆ పనిచేయాల్సి అంటూ ప్రశ్నలు అడిగారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మున్ముందు మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.