Kadiyam Srihari : కాంగ్రెస్ లోకి కడియం..? వేం నరేందర్ రెడ్డితో చర్చలు?

Kadiyam Srihari

Kadiyam Srihari

Kadiyam Srihari : తెలంగాణలో రెండు దశాబ్దాల పాటు బీఆర్ఎస్ హవా నడిచింది. గడిచిన పదేళ్లలోనైతే అధికార పార్టీగా బీఆర్ఎస్ నేతల సందడి మాములుగా ఉండేది కాదు. ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఇక అప్పట్నుంచి ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. పక్క పార్టీల వైపు చూసే నేతలను ఆపతరం కావడం లేదు. ఆరూరి రమేశ్ ను బీజేపీలో చేరకుండా ఆపే ప్రయత్నంలో నేతలంతా ఆయన్ని అదిమిపట్టి మరీ హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఇదే సందు అనుకున్నారో ఏమో గాని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలం వరకూ పార్టీ వ్యవహారాల్లో చాలా చురుకుగా ఉన్న ఆయన.. గత కొద్దిరోజులుగా మౌనం పాటిస్తున్నారు. కీలక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. దీనికి కారణం పార్టీ మారే ఆలోచనేనని చెబుతున్నారు.

కడియం తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నాక టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. మొదట వరంగల్ ఎంపీగా గెలిచారు. తర్వాత ఆ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎంను చేశారు కేసీఆర్. 2018లో మళ్లీ టికెట్ ఇవ్వలేదు. అతి కష్టం మీద ఎమ్మెల్సీ రెన్యూవల్ చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్య గెలిచే పరిస్థితి లేదని కడియం సీటిస్తే ఆయన గెలుచుకొచ్చారు. పార్టీ ఓడిపోయినా పార్టీ తరుపున మొన్నటిదాక బాగానే వాయిస్ వినిపించేవారు. సడెన్ గా ఏమైందో సైలంట్ అయిపోయారు.

అయితే బీఆర్ఎస్ పరిస్థితి బాగా దిగజారుతుండడంతో కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో చర్చించినట్టుగా చెప్తున్నారు. కుమార్తెకు రాజకీయ భవిష్యత్ కల్పించేందుకు కడియం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘన్ పూర్ లో కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థి లేకపోవడంతో అటు వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇవాళ కడియం స్పందిస్తూ తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

TAGS