Pawan Kalyan : పవన్ పై ఒత్తిడి తెస్తున్న బీజేపీ.. ఎందుకంటే..
Pawan Kalyan : మరో రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది. పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరెక్కడ పోటీ చేయాలనే విషయమై నేడు చర్చించనున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో పాటు ఒడిశా ఎంపీ బైజయంతి పండా విజయవాడలో మకాం వేశారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి నేరుగా హోటల్ కు వెళ్లి వారిని కలిశారు. ఏం చర్చలు జరిపారో చెప్పలేదు. తర్వాత అన్నీ చెబుతామని పవన్ దాటేశారు. అయితే బీజేపీ ఏదో విషయంలో పవన్ పై ఒత్తిడి తెస్తుందని మాత్రం అర్థమైపోతోంది.
ఇప్పటికే పార్లమెంట్ సీటును బీజేపీకి పవన్ త్యాగం చేశారు. ఇప్పుడు మరో రెండు అసెంబ్లీ సీట్లను కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కు ఇచ్చిన 24 సీట్లలో రెండు సీట్లను బీజేపీకి కేటాయించాలని అడుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ ను ఎంపీగా పోటీ చేయాలని కూడా బీజేపీ ప్రతిపాదిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎంపీగా గెలిస్తే సీఎంతో సమానమైన కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ ఎంపీగా పోటీ చేయడం అన్నదానిపై ఆలోచనే చేయలేదు.
బీజేపీ, పవన్ చర్చలు సోమవారం జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత అన్ని విషయాలపై ప్రకటన చేస్తారని అంచనా వేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి 10వ తేదీన వచ్చింది. ఆ తేదీ దాటిపోవడంతో ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నికల సంఘం జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షలు పూర్తయ్యాక.. ఒక్క రోజులోనే షెడ్యూల్ వచ్చే అవకాశం కనపడుతుంది. ఈలోపే తమ సీట్లు, అభ్యర్థులను ఫైనల్ చేసుకోవాలని కూటమి పార్టీలు నిర్ణయానికి వచ్చాయి.