CM Jagan : ఆంధ్రాలో జగన్ సంక్షేమ పథకాలకి బిగ్ బ్రేక్..?

CM Jagan

CM Jagan

CM Jagan : ” రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారితే అమ్మఒడి, భరోసా, పేదల ఇళ్ళు, 25 లక్షల వైద్యం తదితర సంక్షేమ పథకాలు ఆగిపోతాయి ” అని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పథకాలు. వీటికి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. కాకపోతే కొన్ని పథకాలకు కేంద్రం – రాష్ట్రం 60 నుంచి 40%; 90 నుంచి 10% : ఇలా ఉమ్మడిగా చెల్లిస్తుంటాయి. సాధారణంగా కేంద్రం వాటా ఎక్కువ ఉంటుంది. అంతకుమించి చాలా రాష్ట్రాలలో కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్ళించిన సంఘటనలు ఎక్కువ కనిపిస్తాయి. కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకు అందుతాయి. కనుక లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వమే తమకు సహాయ సహకారాలు అందిస్తోంది అనుకుంటారు. లబ్ధిదారులు అలా అభిప్రాయ పడడానికి ముఖ్య కారణం – అందజేసేది రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది; కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి ఓ పేరు పెడితే దాన్ని స్థానే రాష్ట్ర ప్రభుత్వం తన పేరు పెట్టుకొని తన వారి ఫోటోలు ముద్రిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తానే ఆ మొత్తం ఇచ్చినట్లు చెబుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ సహాయం అందుకునే వారిలో నూటికి 50% పైగా అధికారంలో ఉన్న ప్రభుత్వ పార్టీ క్యాడర్ అయివుంటారు చాలా చోట్లా..

కేంద్రం మొదటి విడతగా విడుదల చేసిన ఈ నిధులు ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనిచో / రాష్ట్రం తన వాటా విడుదల చేయనిచో కేంద్రం ఈ పథకంలో భాగంగా రెండో విడత విడుదల చేయవలసిన మొత్తాన్ని నిలిపివేస్తుంది. ఆంధ్రాలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలే..! రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా ఈ సంక్షేమ పథకాలు అమలు జరిగి తీరవలసిందే. కారణం – ఈ సంక్షేమ పథకాలకు ఇటు రాష్ట్రం, అటు కేంద్రం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ప్రజల డబ్బే. రకరకాల పన్నుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్న మొత్తాలు కేంద్రానికి అందుతుంది. అలా అందిన మొత్తంలో కొంత భాగాన్ని రాష్టాల వాటాగా సంక్షేమ పథకాలకు, రహదారులు – రైల్వే, ఇరిగేషన్, వ్యవసాయం తదితరలకు ఖర్చు పెట్టి తీరాలి. ప్రజల డబ్బు ప్రజలకు ఖర్చు పెట్టాలి. ఇది ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి లేదు. ఇంకా చెప్పాలంటే, రాష్ట్రంలో ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరిట పథకాలు ప్రచారం చేస్తున్నారు కానీ వారి ట్రస్టుల నుంచి గాని, వారి ఆస్తుల నుంచి గాని పైసా కూడా తీసి ప్రజలకు ఇవ్వడం లేదు. అలాగే కేంద్రం మోడీ పేరిట ప్రవేశపెట్టిన పథకాలు సొమ్ము కూడా ప్రజలదే. ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చి తీరాలి. ఆ పథకాలకు ఎవరి పేరు పెడుతున్నారో వారు పైసా చెల్లించడం లేదు. చివరగా చెప్పేది ఒకటే – ఇది ప్రజల డబ్బు, ఆ ప్రజలకు ఖర్చు పెట్టి తీరాల్సిందే. ఖర్చు పెట్టకపోతే ఆ నిధుల మంజూరు ఆగిపోతుంది. కేంద్రం గాని, రాష్ట్రం గాని తమ మాట ఇవ్వకపోయినా ఆ పథకం ఆగిపోతుంది. అంతేగాని ప్రభుత్వం మారినంత మాత్రాన సంక్షేమ కార్యక్రమాలు ఆగవు. ఆ పథకాలకు తమ పేర్లు పెట్టుకుంటారు పాలకులు. చంద్రబాబు హయాంలోనూ ఈ పథకాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత పథకాల పేర్లు మారాయి. అంతే కాదు కొన్ని సంస్థల పేర్లు కూడా మర్చేస్తారు. ఉదాహరణకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారింది. కొన్ని పథకాలకు ముట్టజెప్పే నగదులో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యానికి మోడీ 5000 రూపాయలు ఇస్తుంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఆ మొత్తాన్ని 25 వేల రూపాయలు చేశారు. అలాగని కొత్త వైద్య సదుపాయాలు ఆ స్థాయిలో పెంచలేదు, ప్రైవేట్ హాస్పిటల్స్ కి చెల్లింపులు ప్యాకేజీ పెంచారని విమర్శలు వచ్చాయి. చివరగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మారినంత మాత్రాన సంక్షేమ పథకాలు ఆగవు. ఇది ప్రజల డబ్బు అని గుర్తుంచుకోవాలి.

సంక్షేమ పథకాల ప్రభావం ఈ ఎన్నికలలో గణనీయంగా ఉంటుందన్నది నిజమే. కారణం – లబ్ధిదారులకు అసలు విషయం తెలియకపోవడమే. సంక్షేమ పథకాలకు ఖర్చుపెట్టేది ప్రజల సొమ్మే.. అయితే ముఖ్యమంత్రిగా ఈ సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన విధానం అభినందనీయం, ఆదర్శనీయం, ఆచరణీయం.

రాజ్యాంగం బడుగులకి ఇచ్చిన హక్కు ఇది. ఖర్చు పెట్టడం ప్రభుత్వాల బాధ్యత ! సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, విద్య, ఉపాధి రంగాల ప్రగతి కూడా ప్రభుత్వ బాధ్యతే..!

– తోటకూర రఘు, ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు

TAGS