Pawan Contest MP : జనసైనికులకు షాకింగ్ న్యూస్..ఎంపీ అభ్యర్థిగా పవన్? పోటీ చేసేది అక్కడ్నుంచే..?
Pawan Contest MP : జనసైనికులే కాదు మెగాభిమానులు అందరి కోరిక పవన్ కల్యాణ్ సీఎం కావాలని.. అందుకోసం వారు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులను అవగతం చేసుకున్న పవన్ ఒంటరిపోరు చేస్తే 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని భావించారు. టీడీపీతో పొత్తు ద్వారా జగన్ ను గద్దెదించగలమని అనుకున్నారు. అందుకే జనసైనికులకు ఇష్టం లేకున్నా తక్కువ సీట్లకే పొత్తును కుదుర్చుకున్నారు. అయినా కూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం లేదా ఏదైనా కీలక మంత్రి పదవి వస్తుందని జనసైనికులు భావించారు. దీని ద్వారా పార్టీని బలోపేతం చేసి భవిష్యత్ లోనైనా పవన్ సీఎం అవుతారని ఆశపడ్డారు.
కానీ పవన్ ఎంపీ బరిలోకి దిగుతారనే వార్త వారి ఆశలపై నీళ్లుచల్లింది. బీజేపీని కూటమిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. బీజేపీ హైకమాండ్ తో నిన్న, నేడు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఎట్టకేలకు పొత్తు కుదిరింది. జనసేన, బీజేపీలకు 30 అసెంబ్లీ సీట్లు, 5 లేదా 6 ఎంపీ సీట్లు కేటాయించేందుకు అంగీకారం కుదిరింది. ఈక్రమంలో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. పవన్ కల్యాణ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం.
బీజేపీ పెద్దల సూచన మేరకు పవన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పవన్ కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో కాపులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో పవన్ ఈ స్థానాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో అన్న అంశంపై క్లారిటీ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అంతకుముందు ఎంపీగా, ఎమ్మెల్యేగా రెండు స్థానాల నుంచి పోటీ చేద్దామనుకున్న పవన్..బీజేపీ పెద్దల సూచనతో ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.