TDP : టీడీపీ మరో వినూత్న కానుక.. వారి బంగారు భవిష్యత్ కు భరోసా..
TDP : ప్రస్తుతం దేశంలో అమ్మాయిల చదువుకు ప్రాధాన్యం పెరిగింది. గతంలో ఆడపిల్లలను స్కూల్ కు పంపించేవారు కాదు. ఉన్నత విద్య అసలే లేదు. రాను రాను తల్లిదండ్రుల వైఖరి మారింది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలను సమానంగా చదివిస్తున్నారు. అయితే ఇది మరింత పెరగాల్సిన అవసరమైతే ఉంది. ఇదే విషయంలో టీడీపీ ఓ కొత్త ఆలోచన చేసింది. అమ్మాయిల చదువులకు ఆర్థిక పరమైన సమస్యలు ఎదురయ్యే సందర్భంలో వారికి సాయంగా ఉండడానికి వినూత్న కార్యక్రమంతో ముందుకొస్తోంది.
ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల వైపు వెళ్లాలనుకున్న విద్యార్థినుల కోసం ‘కలలకు రెక్కలు’ అనే కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే విద్యార్థినులకు ప్రభుత్వ గ్యారెంటీతో బ్యాంక్ రుణాలు ఇస్తుంది. విద్యార్థినులు బ్యాంక్ నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా కార్యక్రమాన్ని రూపొందించింది.
‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా ప్రత్తికొండ పర్యటనలో ఈ కొత్త కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి ప్రకటించారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వంలో కలలకు రెక్కలు కార్యక్రమం ప్రారంభమవుతుందని భువనేశ్వరి ప్రకటించారు. తర్వాత చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా ఈ పథకం వివరాలను వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కారణంగా మన ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకుడదు అన్న ఆశయంతో, ‘కలలకు రెక్కలు’ అనే పథకాన్ని మన ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోతున్నామని ప్రకటించారు. ఇంటర్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. అంతేకాకుండా కోర్సు కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కలలకు రెక్కలు పథకంలో మీ పేరును ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు. అందుకోసం https: //kalalakurekkalu.com వెబ్ సైట్ ను సంప్రదించవచ్చన్నారు.
మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు హామీ ఇచ్చిందే మహాశక్తి పథకం ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం, ప్రతీ మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల చొప్పున అందిస్తామని చంద్రబాబు చెప్తున్నారు. మహిళా సాధికారత ఓట్ల రాజకీయం కాదని, మన ఆడబిడ్డలు బాగుండేలా, వారి బంగారు భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని హామీ ఇస్తున్నారు. కాగా, కలలకు రెక్కలు పథకాన్ని సరిగ్గా అమలు చేయగలిగితే టీడీపీకి ఇక తిరుగుండదు. లక్షలాది అమ్మాయిలు చక్కటి భవిష్యత్ ను నిర్మించుకుని టీడీపీ పట్ల విధేయంగా ఉంటారనే చెప్పవచ్చు.