Jagan VS Chandrababu : జగన్ లేదా బాబు వీరిలో ఎవరో ఒకరు.. తృతీయ ప్రత్యామ్నాయం తూచ్ !
Jagan VS Chandrababu : ఒక రాష్ట్రంలో రెండు, మూడు పార్టీలు ఉంటేనే నేతల్లో పోటీతత్వం పెరిగి మంచి పాలన అందిస్తారు. ఇక రెండు పార్టీలే ఉంటే వీరు కాకపోతే వారు..వారు కాకపోతే వీరు..రోటిన్ పాలనే ఉంటుంది. ఓసారి గెలుపు..ఓ సారి ఓటమి అన్నట్టుగా సాగుతుంది వ్యవహారం. దీంతో పార్టీలు ఓట్లు కొనడానికి, ఉచితాలు అందించడానికే ప్రయత్నిస్తాయి.. తప్ప ప్రజల బాగును ఆలోచించేది తక్కువే. అందుకే ప్రత్యామ్నాయం ఉండాలంటారు ప్రజాస్వామిక వాదులు.
ప్రస్తుతం ఏపీలో ఇదే జరుగుతుంది. ఓసారి టీడీపీ, మరోసారి వైసీపీ అన్నట్టుగా సాగుతోంది గత పదేళ్లుగా. అంతకుముందు అయితే టీడీపీ లేకుంటే కాంగ్రెస్ అన్నట్టుగా ఉండేది. కానీ ఇతరులకు అవకాశం ఇచ్చేవాళ్లు కాదు. 2009 లో టీడీపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ప్రజారాజ్యం వచ్చింది. తొలి ఎన్నికల్లోనే ఓ మోస్తారు ఫలితాలను సాధించినా వివిధ రాజకీయ పరిణామాలతో పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది. ఇక 2019లో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా జనసేన వచ్చింది. ఆ పార్టీ బీజేపీతో దోస్తీ చేస్తూ..ఏపీలో వైసీపీ, టీడీపీలను ఓడించాలని, తామే ప్రత్నామ్నాయం అంటూ జనాల్లోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో పెద్దగా వర్కవుట్ కాలేదు.
ఇక ఆ తర్వాత జనసేన..టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ పంచనే చేరింది. జగన్ రెడ్డిని ఓడించడానికే పొత్తు పెట్టుకున్నామని..ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలను జనసేన తనకు తానే తెంచేసుకుంది. ఇక ఇప్పుడు ఏపీలో మూడో కూటమి అనేదే లేదు. ఉన్నది వైసీపీ, టీడీపీ మాత్రమే. సీఎం అభ్యర్థులు జగన్ లేదా బాబు మాత్రమే. వీరిద్దరూ మాత్రమే ఏపీ రాజకీయాలను శాసించగలరు. ప్రత్యామ్నాయం లేదు..మూడో శక్తి లేదు.. ప్రజలు తమ ఓటును వేస్తే జగన్ కు వేయాలి లేదంటే బాబుకు వేయాలి అంతే. ఇక మూడో ఆలోచనే లేదు.