BRS-BSP Alliance : బీఎస్పీ పొత్తుతో బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశాలివే!?

BRS-BSP Alliance

BRS-BSP Alliance

BRS-BSP Alliance : ‘మాకు ఎలాంటి పొత్తులు అవసరం లేదు.. మేము నేరుగా ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటాం’ అంటూ గర్వంగా చెప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు బీఎస్పీతో దోస్తీ చేయక తప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చతికెల పడ్డ పార్టీ, పార్లమెంట్ కోసం నిర్వహించిన సర్వేలోనూ థర్డ్ ప్లేస్ కు వెళ్లింది. దీంతో ఆలోచనలో పడిన అధినేత బీఎస్పీ వైపు ఆశగా చూడక తప్పని పరిస్థితి. ఇటీవల పొత్తుపై ఇరు పార్టీల నేతలు ప్రవీణ్ కుమార్, కేసీఆర్ ప్రకటించారు. దీనితో పాటు బీఎస్పీకి కొన్ని సీట్లు ఇస్తామని కేసీఆరే మీడియా ముందు చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో తెలంగాణలోనే కాదు మహారాష్ట్రలోనూ పోటీ చేసి 50 సీట్లు గెలుచుకొని కింగ్ మేకర్ అవుతామని కేసీఆర్, యువరాజు కేటీఆర్ ఊకదంపుడు ప్రసంగాలు చేశారు. కానీ ప్రస్తుతం కేవలం తెలంగాణలో ఉన్న 17 సీట్లలో పోటీ చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడపైనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లడంతో పాలక పక్షమైన కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు.

వెళ్లిన వారితో పాటు ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తో టచ్‌లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒకటి, రెండు సీట్లకే పరిమితమైనా.., ఒక్క సీటు గెలవకపోయినా మరింత సంక్షోభంలో పడవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని నుంచి గట్టక్కేందుకే పొత్తు పెట్టుకోవాలని అనుకున్నారు. బీజేపీ వైపునకు చూడగా.. ససేమీరా అంటూ తిప్పికొట్టింది. దీంతో బీఎస్పీని ఆహ్వానించక తప్పలేదు.

ఈ కలయికతో ఎస్సీ, ఎస్టీ ఓట్లు తమ వైపునకు తిప్పుకోవచ్చన్న కేసీఆర్ ఎత్తుగడలు ఏ మేరకు నెరవేరుతాయన్నది వేచి చూడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ పై ప్రధాని మోడీ హామీ నేపథ్యంలో బీఎస్పీ పొత్తుపై వారు సానుకూలంగా ఉన్నారా? అన్నది ఫలితాల వరకు వేచి చూడాలి.

TAGS