BJP Survey : తెలంగాణలో బీజేపీ సంచలన సర్వే.. ఏం తేలిందంటే?

BJP survey

BJP survey in MP Elections 2024

BJP survey in Telangana : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందడి నెలకొంది. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్నికలు కూడా ఏప్రిల్ నెల మూడు లేదా నాలుగు వారాల్లో జరిగే పరిస్థితులున్నాయి. కీలకమైన ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్లు సాధించి రాహుల్ కు కానుకగా ఇవ్వాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో సత్తాచాటి పునర్ వైభవం పొందాలని భావిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న మోదీ హవాతో తెలంగాణలో కూడా భారీ సీట్లు కైవసం చేసుకుంటామన్న నమ్మకంతో ఉంది.

మిగతా పార్టీలకన్నా ముందుగానే బీజేపీ లోక్ సభ ఎన్నికల సమరంలోకి దిగింది. 400 సీట్ల దాక ఎన్డీఏ కూటమి సాధించాలనే లక్ష్యంతో మోదీ, అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాదిన బీజేపీ హవా సాగుతుండగా.. దక్షిణాదిలో ఈసారి భారీగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ప్రధాని మోదీ తరుచూ దక్షిణాదిలో పర్యటిస్తున్నారు. బీజేపీ బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కర్నాటక, తెలంగాణ మాత్రమే. కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు రాబట్టాలని యోచిస్తున్నది. ఈక్రమంలో తెలంగాణలో బీజేపీ సొంత సర్వేలు చేసుకుంటోందని తెలుస్తోంది.

బీజేపీ సొంత సర్వేలో తేలిన విషయాలు షాక్ కు గురిచేసేలా ఉన్నాయి. ఈ సర్వే వివరాలిలా ఉన్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై బీజేపీ అంచనా ఇది..

కాంగ్రెస్ : 8-10
బీజేపీ : 7-9
బీఆర్ఎస్ : 0-1
ఎంఐఎం : 0-1

గత అధికార పార్టీ బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు దిమ్మతిరిగే ఫలితాలను ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ 8 నుంచి 10 సీట్లను గెలుచుకోబోతోందని బీజేపీ సర్వే తెలుపుతోంది. 39.06 ఓట్ల శాతంతో అగ్రస్థానంలో ఉండబోతోందని చెపుతోంది. బీజేపీ 7 నుంచి 9 సీట్లను గెలుచుకుని 32.3 శాతం ఓట్లను రాబట్టుకుంటుందని అంచనా వేసింది. దీని ద్వారా రెండో స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనపడుతున్నట్లు అంచనా వేసింది.

బీఆర్ఎస్ కు అసలు ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశాలు లేవని, ఒక వేళ గెలిస్తే ఒక్క సీటుకే పరిమితం అవుతుందని అంటోంది. అయితే 24.7 శాతం ఓట్లను రాబట్టుకుంటుందని అంచనా వేస్తోంది. ఇక ఎంఐఎం పరిస్థితి కూడా అంతే. గెలిస్తే ఒకటి గెలవవచ్చని అంచనా వేస్తోంది. ఈ పార్టీకి 3.4 శాతం ఓట్లు రావొచ్చని తెలుస్తోంది.

TAGS