Retirement Shoot : రిటైర్ మెంట్ షూట్.. నయా ట్రెండ్ షురూ
Retirement Shoot : మనిషి జీవితంలో ఫొటోలకు, వీడియోలకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన జీవితంలోని అపురూప ఘట్టాలను, అనుభవాలు, అనుభూతులను ఫ్రేమ్ లో బంధించడం, వీడియోలో దాచుకోవడం చేస్తుంటాం. మన జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఎప్పటికప్పుడూ గుర్తుచేసుకోవడానికి, ఆనందపడడానికి ఇవి దోహదపడుతుంటాయి. ప్రస్తుత ఆధునిక కాలంలో ఫొటోలు, వీడియోలకు ప్రాధాన్యం మరింత పెరిగింది. చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల వరకు సెల్ఫీలు, ఫొటోలు లేనిదే రోజు గడవడం లేదనే చెప్పాలి.
ఇక ఇప్పుడంతా ప్రీ వెడ్డింగ్ షూట్ లతో పాటు ప్రతీ ఫంక్షన్ కూ ఓ ఫొటో షూట్ పెట్టుకోవడం కామన్ అయిపోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్ లో కాబోయే జంట సినిమా హీరోహీరోయిన్ల మాదిరిగా వీటిల్లో పాల్గొంటూ తమదైన అభిరుచులతో ఇతరులను ఆకట్టుకునేందుకు ప్రయతిస్తున్నారు. ఇతరుల కంటే భిన్నంగా ఉండేలా, కొత్తగా ఉండేలా తమ ప్రీ వెడ్డింగ్ షూట్ లను ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొందరు వింతగా ఉండేలా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ మధ్య కొందరు బురదలో బొర్రి మరీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం మనకు తెలిసిందే. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ ల గోల ఇలా ఉంటే.. ఇప్పుడు కొత్తగా రిటైర్ మెంట్ షూట్ అనే కొత్త ట్రెండ్ బయలుదేరింది.
ఓ రిటైర్ మెంట్ అయిన జంట తమ రిటైర్ మెంట్ షూట్ ను అద్భుతంగా జరుపుకుంది. శంకర్ సినిమా లోకేషన్లను తలదన్నే లోకేషన్లలో ఓ హిందీ పాటకు ఈ వృద్ధ జంట ఆడిపాడడం అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా హీరోహీరోయిన్లలా వారు ఆడిపాడడం అలరిస్తోంది. ఇప్పుడిది కొత్త ట్రెండ్ గా పాపులర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. పెళ్లయిన దగ్గరి నుంచి ఇల్లు, పిల్లలు, వారి చదువులు, వారికి ఉద్యోగాలు, పెళ్లిళ్లు.. ఇలా జీవిత నావను మోసిన దంపతులు రిటైర్ మెంట్ వయస్సులో ఇలా షూట్ చేసుకోవడం నిజంగా వాళ్లకు రిలాక్సేషనే. జీవితంలో బాధలను, బాధ్యతలను దిగ్విజయంగా ముగించిన తర్వాత ఇలా ఎంజాయ్ చేస్తూ గడపడం నిజంగా అద్భుతమే. దేశంలో ఈ ట్రెండ్ ను ఇప్పటికే చాలా మంది ఫాలో అవుతున్నారు. అరువై దాటితే మీరు కూడా ఓ రొమాంటిక్ సాంగ్ చేసేయ్యండి మరి..