MLA Lasya Nanditha : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో కీలక ఆధారాలు
MLA Lasya Nanditha : తెలంగాణ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం అందరినీ కంటతడి పెట్టించింది. గతేడాది ఇదే నెలలో ఆమె తండ్రి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. ఒకే నెలలో తండ్రి బిడ్డలు చనిపోవడం ఆ కుటుంబంలో పెను విషాధాన్ని నింపింది. మూడు పదుల వయసులోనే లాస్య నందిత దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు నిజాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. లాస్య నందిత కారు డ్రైవర్ గా శేఖర్ అనే వ్యక్తి చాలాకాలంగా పనిచేస్తున్నాడు. అయితే ఈనెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో శేఖర్ కు బదులు మరో వ్యక్తి డ్రైవింగ్ చేశారు. లాస్య నందిత కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారును శేఖర్ డ్రైవింగ్ చేయగా, లాస్య ప్రయాణిస్తున్న కారును ఆకాశ్ అనే వ్యక్తి నడిపాడు.
లాస్య నందితకు దగ్గరి బంధువైన పీయూష్ రాఘవ అలియాస్ ఛోటు ద్వారా ఆకాశ్ ఎమ్మెల్యే వద్ద పనిలో చేరాడు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్ సెలెక్షన్లలో ఉద్యోగం కోసం ఎంపికయ్యాడు. అతడితో ఎంపికైన వారికి ఇటీవలే కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభమైంది. తాను రెండో బ్యాచ్ లో శిక్షణకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఆకాశ్ కు కారు డ్రైవింగ్ అంతంత మాత్రమే వచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న టిప్పర్ ను ఢీకొనడం, ఆ సమయంలో స్పీడ్ నియంత్రించలేకపోవడంతో యువ ఎమ్మెల్యే ప్రమాదంలో మరణించాల్సి వచ్చింది.
తాజాగా లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు మొదట ఓ వాహనాన్ని ఢీకొట్టి, రెయిలింగ్ ను ఢీకొట్టిందని పోలీసులు ఇదివరకు భావించారు. తాజాగా ఆ టిప్పర్ ను గుర్తించి దాన్ని సీజ్ చేశారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే మరణించగా, డ్రైవర్(పీఏ) ఆకాశ్ కు గాయాలయ్యాయి. ఆకాశ్ నిద్రమత్తులో కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు.