Virushka Parenting Tips : ‘విరుష్క’ పేరెంటింగ్ సూత్రాలు..సెలబ్రిటీలకే కాదు.. సాధారణ జనాలకూ ఆదర్శమే!
Virushka Parenting Tips : సెలబ్రిటీలు అంటే నిత్యం ఫొటోషూట్ ల్లో, కెమెరా వెలుగుల్లో ఉంటారని అనుకుంటాం. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం తమ పిల్లలు, కుటుంబం..వంటి విషయాలపై చాలా గోప్యత పాటిస్తారు. ఇలాంటి వారిలో విరాట్-అనుష్క జంట అగ్రస్థానంలో ఉంటారు. ఇటీవలే వీరు రెండో సారి తల్లిదండ్రులయ్యారు. బిడ్డ పుట్టేంత వరకు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచారు. అనుష్క రెండో ప్రెగ్నెన్సీ గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా వీళ్లు మాత్రం స్పందించలేదు. ఇక అఖరికి తమకు కొడుకు పుట్టాడని అధికారికంగా ప్రకటించి తమ వ్యక్తిగత గోప్యతకు సహకరించాలని కోరారు. వ్యక్తిగత విషయాల్లో ఇలా గోప్యత పాటించడంలో మరోసారి ఈ జంట అందరి మనుసులు దోచుకుంది.
సెలబ్రిటీ జంటల్లో అగ్రస్థానం విరాట్-అనుష్కలదే. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ క్యూట్ కపుల్.. ప్రతీ విషయంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ నేటి జంటలకు రిలేషన్ షిప్ పాఠాలు నేర్పుతుంటారు. 2021లో వామిక అనే కూతురుకు జన్మనిచ్చిన ఈ స్టార్ కపుల్ ఇటీవలే రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15న తమకు రెండో కొడుకు పుట్టాడని, వామిక అక్కైందని, మా చిన్నారికి అకాయ్ అని పేరు పెట్టుకున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పిల్లల పుట్టుకు గోప్యత పాటించినా విరుష్క జంట.. పిల్లల పేరెంటింగ్ లో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది..
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకోవాలని ఆరాటపడుతుంటారు. కానీ విరుష్క జంట అందుకు విరుద్ధం. వామిక పుట్టి మూడేళ్లయినా ఇంత వరకు ఒక్క ఫొటో కూడా బయటపెట్టలేదు. తమ పిల్లల్ని కెమెరా కంటికి, స్టార్ కిడ్ కల్చర్ కి దూరంగా ఉంచి పెంచడానికే విరుష్క జంట ఇష్టపడుతోంది. ఇలాంటి ప్రైవసీ పిల్లలు సురక్షితంగా ఎదిగేందుకు దోహదపడుతుందని చెప్పవచ్చు.
విరాట్, అనుష్క ఎంత బిజీగా ఉన్నా తమ పిల్లల కోసం సమయం కేటాయిస్తారు. అనుష్క డెలివరీ కోసం కోహ్లీ ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ లకు దూరమై కుటుంబానికి ప్రాధాన్యమిచ్చాడు. ఇలా జీవితంలో కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితానికి సమప్రాధాన్యమివ్వాలని పరోక్షంగా చెబుతోంది విరుష్క జంట. పిల్లలకు ఇలా తగిన సమయం కేటాయించడం వల్ల వారికి తల్లిదండ్రుల ప్రేమ సమానం అందుతుంది, అది అన్ని విధాల మేలు చేస్తుంది.
ప్రస్తుతం ఎక్కడా చూసినా ‘నానీ కల్చర్’ కొనసాగుతోంది. ఈక్రమంలో చాలా మంది సెలబ్రిటీలే కాదు.. కొంత మంది సామాన్యులు తమ పిల్లల బాగోగులు చూసుకోవడానికి ఓ మహిళ(బేబీ సిట్టర్)ను నియమించుకుంటున్నారు. బయటకు వెళ్లినా వారిని వెంట తీసుకెళ్తూ.. పిల్లల్ని వారికే అప్పగిస్తుంటారు. నిజానికి ఇది సరికాదని నిపుణులు అంటున్నారు. మనం గమనిస్తే విరుష్క జంట ఎప్పుడూ ఇలా చేయలేదు. జంటగా తామెప్పుడు బయటకు వెళ్లినా.. తమ కూతురిని తమ వద్దే ఉంచుకుంటూ కెమెరా కంటికి చిక్కకుండా చూసుకుంటారు.