IPL 2024 : సన్ రైజర్స్ ఆడే మ్యాచ్ లివే..ఇక సమ్మరంతా సంబరాలే..
IPL 2024 : ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ పండుగ ఐపీఎల్ వచ్చేసింది. క్రికెట్ ఫ్యాన్స్ ను సమ్మర్ హీట్ లోనూ సంబరాల్లో ముంచెత్తే గ్రాండ్ టోర్నీ ఐపీఎల్ సీజన్ 17కు షెడ్యూల్ ను ప్రకటించేశారు. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో 17 రోజుల షెడ్యూల్ ను మాత్రమే ప్రకటించారు. ఈ షెడ్యూల్ లో 21 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల తేదీలను బట్టి మిగతా షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనున్నాయి. మార్చి 22న చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
ఇక మన తెలుగు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలన్నా కసితో ఉంది. ఈ ఏడాది హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను ఢీకొట్టనుంది. మార్చి 23న కోల్ కతా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. రిలీజైన మొదటి షెడ్యూల్ ప్రకారం ఉప్పల్ స్టేడియంలో రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. మార్చి 27న ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 5న చెన్నైతో మ్యాచ్ లను సొంత మైదానంలో ఆడనుంది.
గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా సన్ రైజర్స్ జట్టు ఎయిడెన్ మార్క్ రమ్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. అయితే 2023లో అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్ ల్లోనూ నాలుగు గెలిచి 10 మ్యాచ్ లు ఓడిపోయింది. దీంతో 8 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో ఎస్ ఆర్ హెచ్ మేనేజ్ మెంట్ ఇటీవల జరిగిన మినీ వేలంలో విదేశీ ఆటగాళ్లకు పెద్దపీట వేసింది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కు రూ.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది.
ప్రస్తుత జట్టు: మార్క్ రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగ, పాట్ కమిన్స్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్, ఫజల్ హక్ ఫరూఖీ, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ ఆగర్వాల్, టి.నటరాజన్, మయాంక్ మార్ఖండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీశ్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, జతవేద్ సుబ్రహ్మణ్యన్, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్.